కేసీఆర్ ఎన్నికల వ్యూహం చాలా స్పష్టంగా ఉంది..! మూడేళ్ల ముందు నుంచే ఒక విజన్ తో 2019 ఎన్నికల ప్రణాళిక సిద్ధం చేసి, అమల్లో పెట్టుకుంటూ వచ్చారు. ముందుగా ప్రతిపక్షాలను బలహీనం చేసుకుంటూ వచ్చారు. ఫిరాయింపుల్ని ప్రోత్సహించి టీడీపీ ఉనికే ప్రశ్నార్థకం చేశారు. వైకాపా తెలంగాణలో లేనే లేదు. ఇక, మిగిలింది.. కాంగ్రెస్. ఆ పార్టీలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు, వర్గ విభేదాలు లాంటి పరిస్థితులు తెరాసకు అనుకోని అనుకూలతను తెచ్చిపెట్టాయి. సో.. ఈరకంగా ఓ పద్ధతి ప్రకారం వచ్చే ఎన్నికల్లో సునాయాసంగా మరోసారి అధికారం దక్కించుకునే క్రమంలో తెరాస సిద్ధమౌతోంది. అయితే, ఇక్కడ భాజపా గురించి చర్చించుకోవాలి! కాస్త గట్టిగా ప్రయత్నిస్తే తెలంగాణలో భాజపా విస్తరణకు కొంత అనుకూల వాతావరణమే ఉంది. తెరాస వైఫల్యాలపై కమలనాథుడు స్వరం పెంచితే కొంత ఉపయోగం ఉండేది. కానీ, ప్రధాని మోడీ తీసుకునే నిర్ణయాలకు మొదటి ప్రశంస తెలంగాణ నుంచే అన్నట్టుగా కేసీఆర్ వ్యవహార శైలి కొన్నాళ్ల కిందటే మారింది. దాంతో భాజపా వల్ల తెరాసకు ప్రత్యేకంగా వచ్చే సమస్య ఏదీ ఉండదన్నట్టుగానే పరిస్థితి ఉంది. కానీ, తాజాగా భాజపా తీసుకున్న ఓ నిర్ణయం తెరాసకు మున్ముందు సవాలుగా మారేట్టు కనిపిస్తోంది.
భాజపా నాయకత్వం దగ్గరకు తెరాస వైఖరిపై కొంతమంది నేతలు ఓ విషయాన్ని తీసుకెళ్లారని కథనాలు వినిపిస్తున్నాయి. కొందరు ముఖ్యనేతల సమక్షంలో కేంద్ర పథకాలు, కేంద్ర నిధుల విషయమై తెరాస చేసుకుంటున్న ప్రచారం గురించి ప్రత్యేకంగా చర్చించారట! రాష్ట్ర భాజపా నేతలు వరుసగా నలుగురు కేంద్రమంత్రులను ఈ మధ్య కలుసుకోవడానికి కారణమిదే అంటున్నారు. కేంద్ర నిధుల ద్వారా రాష్ట్రంలో అమలు జరుగుతున్న ఇళ్ల నిర్మాణం, ఫించెన్ల పంపిణీ వంటి కార్యక్రమాల్లో ఏ దశలోనూ కేంద్రం ప్రభుత్వ ప్రస్థావన ఉండటం లేదనీ, ఇటీవలే తీవ్రవాద ప్రాంతాల అభివృద్ధి నిధుల్లో భాగంగా రాష్ట్రానికి రూ. 1,300 విడుదల చేస్తే… వాటిని కూడా తాము పోరాడి సాధించుకున్న నిధులుగా కేసీఆర్ చెప్పుకుంటున్నారనే అంశంపై ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. దీంతోపాటు కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల అమలుకు సంబంధించిన నివేదికను కూడా రాష్ట్రానికి చెందిన కీలక భాజపా నేతలు భాజపాకి అందించినట్టు సమాచారం.
ఇవే అంశాలపై భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఆరా తీస్తున్నారనీ, త్వరలోనే మరోసారి రాష్ట్ర భాజపా నేతలు కొన్ని నివేదికలతో ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమౌతున్నట్టు సమాచారం. జనవరి నెలాఖరున లేదా, ఫిబ్రవరి మొదటి వారంలో అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు. ఈలోగా సమాచారమంతా సేకరించి, దీని ఆధారంగా రాష్ట్రంలో భాజపా ప్రచార వ్యూహాన్ని ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. గడచిన నాలుగేళ్లుగా కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చిన నిధులు, వాటి లెక్కలూ తీశాక… ఇవే విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భాజపా పక్కా ప్రణాళికతో సిద్ధం కాబోతోంది. అన్ని మాధ్యమాల ద్వారా భాజపా ప్రచారాన్ని మొదలుపెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. తెలంగాణలో పార్టీ విస్తరణకు దీన్నే ప్రధానాస్త్రంగా మార్చుకోవాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. మొత్తానికి, ఒక పక్కా ప్రణాళికతో భాజపా సిద్ధమౌతోందన్నమాట! ఈ ప్రణాళికను అమల్లోకి తెస్తే.. కేసీఆర్ ప్రభుత్వంపై భాజపా విమర్శల స్వరం పెరుగుతుంది. సో.. ఇన్నాళ్లూ భాజపాని లైట్ తీసుకుంటూ వస్తున్న కేసీఆర్ కు, రాబోయే రోజుల్లో భాజపా నుంచి కూడా కొన్ని సవాళ్లు తప్పేట్టుగా లేవు. భాజపా ఇంత ప్రిపరేషన్ లో ఉందని తెలిస్తే… తెరాసలో కూడా ఖాళీగా కూర్చోదు కదా! మరి, వారి వ్యూహరచన ఎలా ఉంటుందో చూడాలి.