విజయ్ దేవరకొండ ఫామ్, అతని చేతికి చిక్కుతున్న సినిమాలు మామూలుగా లేవు. ప్రస్తుతం 5 సినిమాలు అతని ఖాతాలో ఉన్నాయి. ఎప్పుడు ఏది పట్టాలెక్కుతుందో తెలీదుగానీ, మరికొంత మంది నిర్మాతలు చేతిలో అడ్వాన్సులు పట్టుకొని విజయ్ కాల్సీట్ల కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా భవ్య ఆర్ట్స్ సంస్థలో ఓ సినిమా చేయడానికి విజయ్ దేవరకొండ ఒప్పుకొన్నాడు. ఈ చిత్రానికి దేవా కట్టా దర్శకత్వం వహిస్తారు. ఆనంద ప్రసాద్ నిర్మాత. ప్రస్థానం సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు దేవా కట్టా. ఆ తరవాత.. తెరకెక్కిన ఆటోనగర్ సూర్య ఫ్లాప్ అయ్యింది. డైనమేట్ కూడా… అంతే పరిస్థితి. ఈ దశలో దేవాకట్టాని నమ్మి సినిమా చేస్తాననడం విజయ్ తీసుకొన్న సాహసోపేత నిర్ణయమే అనుకోవాలి. విజయ్ కి కథ నచ్చడం, భవ్య దగ్గర అడ్వాన్సు తీసుకోవడం జరిగిపోయాయి. అయితే.. ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందన్నది ఇప్పుడే చెప్పలేం. బహుశా 2018 చివర్లో ఈ ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లొచ్చు. ఈలోగా విజయ్ నుంచి మరో రెండు సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది.