సీసీఎల్ (సెలబ్రెటీ క్రికెట్ లీగ్) పదో సీజన్ ముగిసిపోయింది. తెలుగు వారియర్స్ విజయం సాధించడం, మూడోసారి టైటిల్ కైవసం చేసుకోవడం ఈ సీజన్ హైలెట్స్. అయితే… సీసీఎల్ కళ క్రమంగా తగ్గిపోతూ వచ్చింది. ఈయేట టోర్నీ సాగిన తీరే అందుకు నిదర్శనం. గతంలో సీసీఎల్‌లో స్టార్ హడావుడి ఎక్కువగా కనిపించేది. వెంకటేష్. శ్రీకాంత్‌లాంటి పేరున్న నటులు కనిపించేవారు. ఆడినా, ఆడకపోయినా.. వాళ్లని చూడ్డానికి స్టేడియాల్లోకి ఎగబడేవారు ప్రేక్షకులు. ఈసారి అఖిల్ తప్ప.. జనాల్ని ఆకర్షించే హీరోలు ఎవ్వరూ లేరు. మ్యాచ్‌లకు సరైన ప్రమోషన్లూ జరగలేదు.
ఇది వరకు సీసీఎల్ పేరిట చాలా హడావుడి సాగేది. కర్టెన్‌రైజర్ ఘనంగా చేసేవారు. కేవలం ఆ ఒక్క కార్యక్రమానికే కోటి రూపాయల వరకూ ఖర్చు పెట్టేవారు. దక్షిణాది తారలంతా కలసి ఓ పార్టీలా సెలబ్రేట్ చేసేవారు. ఒకొక్కరికీ మ్యాచ్‌లో పాల్గొన్నందుకు గానూ… భారీ బహుమానాలు ఉండేవి. ఆటగాళ్లు కూడా ఓ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడుతున్నంత సీరియెస్‌గా ప్రాక్టీస్ చేసేవారు. మీడియాలో.. కథనాలు విస్ర్కృతంగా వచ్చేవి. ఇన్నేళ్లుగా ఈనాడు దిన పత్రిక సీసీఎల్ కి మీడియా పార్టనర్‌గా వ్యవహరిస్తూ… సినిమా పేజీలో దాదాపుగా సగం పేజీ ఈ ఈవెంట్‌కి కేటాయించేది. ఇప్పుడు మాత్రం ఎక్కడో మారు మూల చిన్న వార్తకి పరిమితం చేసింది. స్టార్స్ లేకపోవడం, ఇరవై ఓవర్ల ఆట కాస్త 10 ఓవర్లకు కుదించడం, నాలుగు వారాలు సాగే ఆట.. రెండు రోజులకు పరిమితం చేయడం ఇవన్నీ చూస్తుంటే సీసీఎల్ ఈవెంట్ కున్న ఆకర్షణ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి పడిపోయిందో అర్థమవుతుంది. వచ్చే యేడాది సీసీఎల్ కనిపించకపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.