ఫాతిమా కాలేజ్ విద్యార్థుల వ్యవహారమై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ట్వీట్ ద్వారా ఒక లేఖ రాశారు. విద్యార్థుల జీవితాలు నాశనం అయిపోతుంటే ప్రభుత్వాలు చూస్తూ ఊరుకుంటున్నాయని, చర్యలు తీసుకోవాని ముఖ్యమంత్రిని కోరారు. అయితే, ఇంతకీ ఫాతిమా కాలేజ్ వ్యవహారాల్లో చర్యలు ఎక్కడి నుంచి మొదలు కావాలి..? రాష్ట్రం చేయాల్సింది ఏదైనా ఉందా..? చేయాల్సిందేం లేదా, లేదంటే తమ పరిధిలో చేయాల్సినవన్నీ చేసేసిందా..? ఇలాంటి ప్రశ్నలకు మిశ్రమ స్పందనే వస్తుంది. ఎందుకంటే, ఈ వ్యవహారంలో ఉన్న చిక్కుముళ్లు అలాంటివి.
నిజానికి, ఈ సమస్య తేలాలంటే రాష్ట్రంతో మాత్రమే అయ్యేపని కాదు, ఎందుకంటే దీన్లో కేంద్రం జోక్యం చాలా అవసరం. కేంద్ర ప్రభుత్వంతోపాటు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కలిసి నిర్ణయం తీసుకుంటేనే ఫాతిమా విద్యార్థులకు కొంతైనా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. పవన్ కోరుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించే పరిస్థితి లేదు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏదైనా ఆర్డినెన్స్ తీసుకొస్తే.. దాన్ని మెడికల్ కౌన్సిల్ ఒప్పుకోదు. కాబట్టి, అలాంటి ఆర్డినెన్సులు ఎన్ని తెచ్చినా కంటితుడుపు చర్యలే అవుతాయి. ఇక, వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖా పరమైన చర్యలు అంటే… రాష్ట్ర స్థాయిలో అవీ జరిగిపోయాయి. నిజానికి, ఫాతిమా విద్యార్థుల సమస్యపై పవన్ కల్యాణ్ ఆ మధ్య స్పందించగానే… ఏపీ మంత్రి కామినేని ఆ విద్యార్థుల తల్లిదండ్రులను కలుసుకున్నారు. వారికి కొంత భరోసా ఇచ్చే విధంగా మాట్లాడారు. ఎవ్వరికీ అన్యాయం జరగకుండా చూస్తామని చెప్పారు. చర్యలు తీసుకుంటామన్నారు. కానీ, ఇంతవరకూ వారు చేసేందేమీ లేదు.
ఇక, కాలేజీ తరఫు నుంచి ఆలోచిస్తే… మహా అయితే మేనేజ్మెంట్ కోటా ద్వారా విద్యార్థులు కట్టిన ఫీజు వెనక్కి ఇచ్చేస్తాం అంటారు. అంతకుమించి వారు కూడా చేసేదేం లేదు. కానీ, విద్యార్థుల ప్రశ్న ఏంటంటే.. తాము నష్టపోతున్న విద్యా సంవత్సరాల పరిస్థితి ఏంటనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోసారి ఎంసెట్ కి ప్రిపేర్ అయి, రాసే పరిస్థితి లేదన్నది వారి ఆందోళన. సో… ఫాతిమా విద్యార్థుల వ్యవహారంలో ఏదో ఒకటి చేయాలీ అని రాష్ట్రం ఇప్పటికిప్పుడు నిర్ణయించుకున్నా.. కాలేజీ యాజమాన్యంపై చట్టపరంగా చర్యలకు దిగే అవకాశం మాత్రమే ఉంది. ఏం చేసినా కేంద్రమే చేయాలి. కాబట్టి, పవన్ తన లేఖల్ని చంద్రబాబుతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ కీ, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు కూడా పంపితే బాగుంటుంది. ఎందుకంటే, వీరందరూ కలిస్తే తప్ప.. ఫాతిమా కాలేజ్ విద్యార్థుల వ్యవహారంలో కొంత స్పష్టత రాదు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చేయాల్సిందేం లేదు. . ఈ విషయాన్ని మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం తప్ప!