గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. రెండోసారి ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆ తరువాత, 18 మంది మంత్రులతో కూడా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీపాటు, భాజపా అధ్యక్షుడు అమిత్ షా, సీనియర్ నేత అద్వానీతోపాటు 19 ఎన్డీయే పాలిత రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కూడా హాజరు కావడం విశేషం! అయితే, ఆ లెక్క ప్రకారం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా అక్కడ ఉండాలి కదా. కానీ, ఆయన గాంధీ నగర్ కి వెళ్లలేదు. రాష్ట్రం తరఫున మంత్రి యనమల రామకృష్ణుడుని పంపించారు. దీంతో మరోసారి భాజపా, టీడీపీ సంబంధ బాంధవ్యాల మధ్య ఉన్న బలంపై చర్చకు ఆస్కారం ఇచ్చినట్టయింది. ముఖ్యమంత్రికి ఇతర కార్యక్రమాలు ఉండటం వల్ల ఆయన వెళ్లలేకపోయారనీ, అందుకే మంత్రి యనమలను పంపించారని ఏపీ వర్గాలు అంటున్నాయి. కానీ, చంద్రబాబు గుజరాత్ కి వెళ్లకపోవడం వెనక కేంద్రం తీరుపై ఏపీకి ఉన్న అభిప్రాయం చెప్పకనే చెప్పినట్టు అవుతోందనేది విశ్లేషకుల మాట!
నిజానికి, ఏపీ ముఖ్యమంత్రికి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్న చర్చ చాన్నాళ్లుగా ఉంది. దానికి తగ్గట్టుగానే ఈ మధ్య ఆంధ్రాకు సంబంధించిన ఎంతటి కీలక వ్యవహారంపై ఏపీ నేతలు ఢిల్లీకి వెళ్లినా.. కేంద్ర మంత్రుల వరకే వారు కలుసుకోగలుగుతున్నారు. ఇటీవల అత్యంత చర్చనీయమైన పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించింది లేదు. కేంద్ర రాష్ట్రాల మధ్య ఎంత లొల్లి జరిగినా.. నితిన్ గట్కరీ వరకే ఈ అంశాన్ని పరిమితం చేశారు. పోలవరంపై ఈ మధ్య కాలంలో ఒక్కసారైనా ప్రధాని మాట్లాడి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఈ అసంతృప్తి టీడీపీ శ్రేణుల్లో గుంభనంగా ఉంది.
ఇక, మారిన ప్రధానమంత్రి వ్యవహార శైలి కూడా చంద్రబాబు వెళ్లకపోవడం వెనక కారణంగా చూడొచ్చు! ఎన్డీయే సంప్రదాయ భాగస్వామ్య పక్షాలను మోడీ నెమ్మదిగా పక్కన పెడుతున్నారు. ప్రాధాన్యత తగ్గిస్తున్నారు అనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. కొత్త పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు. దీంతో సహజంగానే ఎప్పట్నుంచో ఉన్న భాగస్వామ్య పక్షాలకు కొంత కోపం వస్తుంది. ఇప్పటికే శివసేన తన ఆవేదనను బయటపెట్టేసింది. గుజరాత్ లో అట్టహాసంగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరుగుతుంటే భాజపా తీరుపై తీవ్ర విమర్శలు చేశారు బాల్ థాక్రే. ఓ పక్క కాశ్మీర్ లో జవాన్లు ప్రాణాలు కోల్పోతుంటే, వీళ్లు సంబరాలు చేసుకోవడానికి తప్ప దేనికీ పనికిరారు అంటూ తీవ్రంగా స్పందించారు.
సో.. భాగస్వామ్య పక్షాల విషయమై మోడీ ప్రవర్తన ఎలా మారిందనేది తెలుస్తూనే ఉంది. ఇక, ఆంధ్రా విషయానికొస్తే.. ప్రధానికి ప్రత్యేక దృష్టి అంటూ ఎప్పుడూ లేదు. ప్రత్యేక హోదా విషయంలోగానీ, కంటితుడుపుగా ప్రకటించిన ప్యాకేజీ విషయంలోగానీ, రైల్వే జోన్ విషయంలోగానీ, రెవెన్యూ లోటు భర్తీ చేయడంలోగానీ, రాజధానికి రావాల్సిన నిధుల విషయంలోగానీ.. ఇలా ఏ అంశంలో తీసుకున్నా ఆంధ్రా విషయమై ప్రధాని ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న సందర్భాలు లేనే లేవు. అయినాసరే, కేంద్రంతో కలిసి కొనసాగాల్సిన పరిస్థితులు ఉన్నప్పటికీ.. భాజపా తీరుపై బయటపడలేని కొంత అసంతృప్తి టీడీపీలో ఉంది. అందుకే, ప్రధాని మోడీని అహ్మదాబాద్ వేదికపై కలుసుకునే అవకాశం ఉన్నా కూడా.. చంద్రబాబు వెళ్లలేదనే వాదన కూడా వినిపిస్తోంది.