ఇదేదో వాట్స్ ఆప్ లేదా ఫేస్ బుక్ లో వచ్చిన సంచలన వార్త కాదు. దేశ వ్యాప్తంగా ఆర్ధిక బాధలు తాళలేక ఆత్మహత్యలు చేసుకొంటున్న వేలాది అన్నదాతలలో ఒక నిరుపేద రైతు తన జీవితానికి విషాదాంతమయిన ముగింపు ఇచ్చే ముందు చెప్పిన మాట ఇది.
మహారాష్ట్రాలో మరాట్వాడా ప్రాంతంలో జల్నా జిల్లాలోని శేషరావు షేజుల్ అనే నిరుపేద రైతు గత రెండు రోజులుగా తన గ్రామంలో కలియతిరుగుతూ కనబడిన వారందరికీ తను త్వరలోనే చనిపోబోతున్నానని కనుక అందరూ తప్పకుండా తన అంత్యక్రియలకు హాజరు కావలసిందిగా చెప్పాడు. కానీ గ్రామంలో ఎవరూ అతని మాటలను పట్టించుకోలేదు. తమతో హాస్యమాడుతున్నాడని అందరూ భావించారు. ఆ మరునాడు ఉదయం అందరూ మేల్కొని చూసేసరికి అతను ఆ ఊరి నడిబొడ్డున గల వేపచేట్టుకి ఉరి వేసుకొని వ్రేలాడుతూ కనబడ్డాడు. ఇంతకీ అతని ప్రాణం ఖరీదు ఎంత అంటే రూ.80,000 మాత్రమే.
దేశంలో నిత్యం ఆత్మహత్యలు చేసుకొంటున్న అనేక రైతుల వేదనాభరితమయిన కధే శేషరావు షేజుల్ ది కూడా. అతనికి రెండెకరాల పొలం ఉంది. గత కొన్నేళ్లుగా సరయిన పంటలు పండక నానా బాధలు పడుతున్నాడు. కొన్ని నెలల క్రితమే రూ.80,000 అప్పు తెచ్చి సోయాబీన్ పంట వేశాడు. కానీ అది కూడా సరిగ్గా పండలేదు. పైగా ఇంట్లో పెళ్ళికి ఎదిగిన కూతురు ఉంది. పంట చేతికి అందకపోవడంతో అప్పు తీర్చే మార్గం కనబడలేదు. అప్పు తీర్చమని నానాటికీ ఒత్తిడి పెరిగిపోతోంది. మరోవైపు కళ్ళ ముందే నశించిపోయిన పంట. ఆ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకొన్నాడు. అయితే మిగిలిన రైతులలాగ పొలంలోకి వెళ్లి పురుగుల మందు త్రాగి చనిపోకుండా, తను చనిపోబోతున్నట్లు ఊరందరికీ చెప్పాడు. కానీ ఊర్లో ఇంచుమించు అందరి పరిస్థితి అలాగే ఉండటంతో ఎవరూ అతని మాటలను సీరియస్ గా తీసుకోలేదు. తత్ఫలితంగా అందరికీ అన్నం పెట్టే మరో అన్నదాత జీవితం విషాదాంతంగా ముగిసిపోయింది. అప్పుడు శేషరావు షేజుల్ కోరుకోన్నట్లుగానే గ్రామస్తులందరూ కన్నీళ్ళతో అతనికి తుది వీడ్కోలు పలికారు. షరా మామూలుగానే అతని మరణంపై మహారాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న శివసేన, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం ఎన్నో పధకాలు ప్రవేశపెట్టామని, రైతులకు ఎంతో సహాయం చేస్తున్నామని చెప్పుకొంటాయి. కానీ అవేవీ రైతుల ప్రాణాలను కాపాడలేకపోతున్నాయి. ఈ పరిస్థితి ఇంకా ఎప్పటికి మారుతుందో.. ఇంకా ఎన్ని వేల మంది రైతులు ప్రాణాలు కోల్పోవాలో..ఏమో ఎవరికీ తెలియదు.