వచ్చేటప్పుడు గబ్బర్ సింగ్‌లా వచ్చి వెళ్లేప్పుడు సిద్దప్పలా వెళతారని నేను అమరావతి రైతులకు సంబంధించి హీరో పవన్‌కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్య సోషల్ మీడియాలో చాలానే దుమారం రేపింది. వాస్తవానికి ఆయనపై వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్య కాదది. హీరోగా తన సినిమాలు నేను బాగా చూస్తాను. కాని రాజకీయాల్లోకి వచ్చేప్పుడు కూడా ఆహ్వానించాను. అయితే ఒకసారి వచ్చాక ఆయన రాజకీయ ప్రభావం చూడాలి. ప్రజలకు మేలు చేయకపోయినా భ్రమలు కలిగించి ఆశాభంగానికి గురి చేయకూడదన్న సూత్రం అందరికీ వర్తిస్తుంది. నా విమర్శ కూడా ఆ కోణంలోనే. అయినా ఆయన అభిమానులు కొందరు బాధపడగా మరికొందరు నాపై మండి పడ్డారు. బహుశా ఇలాటి విమర్శలెందుకనే కావచ్చు – జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఎంట్రీ ఎగ్జిట్ రెండూ మానేశారు! అక్కడెక్కడో షూటింగులో మునిగి పోయారు. సినిమాల్లో హీరో ఆపదలో వస్తే పోలీసులు అంతా అయిపోయాక వస్తారు. బహుశా ఇక్కడా అదే జరగొచ్చు. ఇది కొంత బెటరే అనిపిస్తుంది గాని ఆయన ప్రచారంపై ఆశలు పెట్టుకున్నవారికి అశనిపాతమే మరి! ఇంతకు ముందు ఆంధ్ర ప్రదేశ్‌కు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నిలదీస్తానని నీరసపడ్డారు. ఇప్పుడు తెలంగాణలోనూ అదే పునరావృతమవుతున్నదనిపిస్తుంది.
కాకపోతే ఇక్కడే పవన్ కళ్యాణ్ వైఖరిపై ప్రశ్నలు తలెత్తుతాయి. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా సాగుతున్న రోజుల్లోనే ఆయన కెమెరామెన్ గంగతో రాంబాబు తీశారు. హైదరాబాదు నగరంలో పరిస్థితిని తీసుకుని తీవ్రమైన సన్నివేశాలు సంభాషణలు పాత్రలు ప్రదర్శించారు. తర్వాత వాటిని కొంత తీసేశారు కూడా. జనసేన పార్టీ లేదా సంస్థ ప్రారంభసభలోనూ ఆయన విమర్శ ప్రధానంగా తెలంగాణ జాగృతి అద్యక్షురాలు కవితపైనే సాగింది. ప్రాంతీయ కోణంలోనూ చాలా మాట్లాడారు. హైదరాబాదులో ఆయన ప్రచారం చాలా ప్రభావం వుంటుందని, వుందని కూడా అనుకున్నారు. ఆలస్యంగా రంగంలోకి వచ్చారు గనక అప్పుడు పోటీ చేయలేకపోయారనీ, కార్పొరేషన్‌లో విశ్వరూపం చూపిస్తారని సంకేతాలు ఇచ్చారు. లేదా వచ్చిన సంకేతాలను ఖండించలేదు. ఆ ఎన్నికల్లో రాజధానిలో టిడిపి బిజెపి బాగా ఫలితాలు సాధించడంతో జనసేన తరపున పోటీ చేస్తే గెలిచేస్తామని అనేకమంది ఆశలు పెట్టుకున్నారు. కనీసం టిడిపి బిజెపిల తరపున చేసినా ఆయన ప్రచారం వల్ల ప్రయోజనం కలుగుతుందనుకున్నారు. అది కూడా జరక్కపోవచ్చని తెలుగు360 గతంలోనే స్టోరీ ఇచ్చింది. ఇప్పుడు జిహెచ్‌ఎంసి సందడి మొదలైనప్పటికీ పవర్ స్టార్ నుంచి ఎలాటి ప్రకటనా ప్రతిస్పందనా లేదు. విశేషమేమంటే ఆయన అంతగా విమర్శించిన కవిత నిజామాబాద్ ఎంపిగా గెలిచి గ్రేటర్ ప్రచారం చేపట్టేడమే గాక పవన్‌పై పంచ్‌లు కూడా వేశారు.అయినా ఖండన లేదు.. కనీస స్పందనా లేదు. కారణాలు వూహించడం కష్టం కాదుగానీ ఇన్ని రాజకీయ విన్యాసాలు న్యాయమా అన్నదే ప్రశ్న. ఈ విన్యాసాలు విశ్వసనీయతను దెబ్బతీయవా అని అడిగామనుకోండి.. పులి పలకరించింది కదా అని పక్కన నిలబడి పోటో తీయించుకోకూడదు.. సింహం నిద్ర పోతుందా కదా అని జూలుతో జడవేయించుకోకూడదు అని అభిమాన అభ్యర్థులకు చెబుతారేమో! అయినా చంద్రబాబు విషయమే అంతంత మాత్రంగా వుంటే పవర్‌స్టార్‌ను ఆడిపోసుకోవడం అర్థం లేని విషయం. కనుక కార్పొరేషన్ కదనంలో కళ్యాణచంద్రమస్తు కలే.