మొత్తానికి, కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవమే అయింది. పోటీలో నిలబడ్డ ఇతర అభ్యర్థుల నామినేషన్లు ఉప సంహరణతో ఎమ్మెల్సీగా కె.ఇ. ప్రభాకర్ ఎన్నిక ఏకగ్రీవానికి మార్గం సుగమమైంది. ఈ ఎన్నికల బరి నుంచి వైకాపా ముందుగానే తప్పుకుంది. విలువలతో కూడిన రాజకీయం చేస్తున్న తమకు, ఇలాంటి పదవులు తృణప్రాయమనీ, టీడీపీ చేసే డబ్బు రాజకీయాలను అడ్డుకోవాలన్న ఉద్దేశంతోనే పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు వారు ముందే ప్రకటించారు. అయితే, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు, బీఎస్సీ నుంచి మరో అభ్యర్థి నామినేషన్ దాఖలైంది. ఫోర్జురీ అభియోగంతో బీఎస్సీ అభ్యర్థి పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక, మిగిలిన అభ్యర్థులతో టీడీపీ జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు జయప్రకాష్ రెడ్డి పోటీ నుంచి తప్పుకున్నారు. నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఫలితంగా స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నిక బరిలో ఉన్న బైరెడ్డి అనుచరుడు నాగిరెడ్డి కూడా పోటీ నుంచి తప్పుకున్నారు.
దీంతో కె.ఇ. ప్రభాకర్ ఎన్నిక లాంఛనమైంది. ఈ గెలుపును టీడీపీ సంబరంగా జరుపుకునే అవకాశం ఉంది. అయితే, ఈ గెలుపుపై వైకాపా విమర్శలు షరా మామూలేగానే ఉంటాయి. అధికారాన్నీ డబ్బునీ అడ్డం పెట్టుకుని ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారంటూ ఆ పార్టీ ఆరోపిస్తుంది. టీడీపీకి రాజకీయంగా ఈ ఎన్నిక ఎంత మైలేజ్ పెంచుతుందో తెలీదుగానీ.. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాజకీయ పునరాగమనానికి మాత్రం ఇది బాగా ఉపయోగపడిందని అనుకోవచ్చు. నిన్నే ముఖ్యమంత్రి చంద్రబాబుతో దాదాపు ఐదేళ్ల తరువాత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ ఇద్దరి మధ్యా ఎమ్మెల్సీ ఎన్నికతోపాటు, బైరెడ్డి టీడీపీలో చేరిక అంశం ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో పార్టీలో తనకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారనే అంశం కూడా ఈ ఇద్దరి మధ్యా చర్చకు వచ్చిందని అంటున్నారు.
నిజానికి, టీడీపీకి రాజీనామా చేసిన తరువాత బైరెడ్డి రాయలసీమ పరిరక్షణ సమితిని స్థాపించారు. ఆ మధ్య జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా ఆర్పీఎస్ తరఫున అభ్యర్థిని బరిలోకి దించారు. అయితే, ఇప్పుడు అనూహ్యంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నిక రావడంతో… బైరెడ్డికి మరోసారి సొంత గూటికి వెళ్లే మార్గం సుగమమైందని చెప్పాలి. బైరెడ్డి – చంద్రబాబు భేటీ కోసం తెర వెనక మంత్రాగాన్ని కేయీ సోదరులే నడిపారని అంటున్నారు! వారి చొరవతోనే బైరెడ్డి టీడీపీలోకి వస్తున్నారనేది వినిపిస్తోంది. తన ప్రాధాన్యతను చాటుకుంటూ, టీడీపీలో తనకు దక్కాల్సిన స్థానాన్ని ముందుగానే చంద్రబాబుతో చర్చించుకునేందుకు వీలుగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికను బైరెడ్డి వ్యూహాత్మకంగా వినియోగించుకున్నారని కూడా చెప్పొచ్చు.