ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు వచ్చాయి. అందులో ముగ్గురు స్టార్ హీరోలు. ఒక చిన్న హీరో. అయినా సరే.. టాలీవుడ్ వసూళ్లు మాత్రం ఆశించినంతగా కనిపించట్లేదంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఎప్పుడూ లేనంతగా ఈ సారి భారీ చిత్రాలు సంక్రాంతి బరిలో పందెంకోళ్లలా దిగుతుంటే.. పోటీ భలే రంజుగా ఉంటుందని ఆశించారు. ధియేటర్ల దగ్గర కనకవర్షం కురుస్తుందని అంచనా వేశారు. కానీ ఏ అంచనాలతో ఆశలు పెట్టుకున్నారో.. అవే నిరాశపరిచాయి.
సంక్రాంతికి ఒక రోజు ముందే బరిలో దిగిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ మూడు రోజుల్లో 30 కోట్ల వరకు వసూలు చేశాడు. ఆ తర్వాత వచ్చిన బాబాయ్ డిక్టేటర్ రెండు రోజుల్లో 20 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు చేశాడు. అదే రోజు రిలీజైన శర్వానంద్ ఎక్స్ ప్రెస్ రాజా కూడా రెండు రోజుల్లో ఓ పది కోట్ల వరకు వసూలు చేసింది. పండుగ రోజే.. పంచెకట్టుతో ధియేటర్లో అడుగుపెట్టిన సోగ్గాడే చిన్నినాయన నాగార్జున మొదటి రోజు ఏడు కోట్ల వరకు వసూలు చేసినట్టు లెక్కలు వేస్తున్నారు.
ఈ నాలుగు సినిమాలు కలిపి… పండుగ రోజుల్లో వసూలు చేసిన మొత్తం కలిపితే.. 100 కోట్ల కూడా రాలేదు. ఈ నాలుగు పుంజుల కన్నా.. పందెం పుంజులు భారీగా వసూలు చేశాయని సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. గోదావరి జిల్లాల్లో జరిగే కోళ్ల పందాల్లో నాలుగు పందేలు వేస్తే.. ఈ వంద కోట్లు అలవోకగా కొట్టుకొచ్చేవంటూ ఈ హీరోల కంటే తమ పందెం కోళ్లే ఎక్కువ వసూలు చేశాయంటున్నారు పందెంరాయుళ్లు.
అయితే.. నాలుగు సినిమాలు వచ్చాయి కాబట్టే.. ఈ మాత్రం అయినా.. వసూలైంది. ఏదో రెండు సినిమాలు వస్తే.. ఈ మాత్రం కలెక్షన్లు కూడా వచ్చి ఉండేవి కావనే వారు కూడా ఉన్నారు.