ట్రిపుల్ తలాక్ పై చారిత్రక నిర్ణయం తీసుకుంది మోడీ సర్కారు. లోక్ సభలో తిరుగులేని మెజారిటీ భారతీయ జనతా పార్టీకి ఉంది కాబట్టి, ఈ బిల్లుకు అనూహ్యమైన స్పందన లభించింది. భాగస్వామ్య పక్షాలు విప్ జారీ చేసి మరీ అభ్యర్థులను సభకు వచ్చేలా చేశాయి. దీంతో లోక్ సభ నుంచి ఈ బిల్లు గట్టేక్కేసింది. ఇప్పుడు అసలు సవాల్ రాజ్యసభలో ఉంది. ఎందుకంటే, అక్కడ ప్రతిపక్షాలకు మెజారిటీ ఎక్కువ. కాబట్టి, కొన్ని సవరణలు తప్పకపోవచ్చనే వాతావరణమే కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అనుసరించే వైఖరిపై మార్పులూ చేర్పులూ ఉంటాయి. సరే, రాజ్యసభలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా.. ఈ బిల్లును వచ్చే ఎన్నికల్లో తమ ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకునేందుకు భాజపా సిద్ధంగా ఉందని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. ఆ మేరకు కొంత వ్యూహరచన జరుగుతున్నట్టు కథనాలు కూడా లీక్ చేస్తున్నారు.
నిజానికి, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం మహిళలను ప్రధానంగా ఆకర్షించింది ఈ తలాక్ రద్దు హామీ రద్దు అనొచ్చు. అక్కడ భాజపాకి ఇది బాగానే కలిసి వచ్చింది. కాబట్టి, లోక్ సభ ఎన్నికల్లో కూడా మైనారిటీలను ఆకర్షించే ప్రధానాస్త్రం ఇదే అవుతుందనే సంకేతాలు భాజపా ఇస్తోంది. ఇలా ఇప్పట్నుంచే కొంత ప్రచారం మొదలుపెట్టడం ద్వారా.. రాజ్యసభలో దీన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ కూడా కొంత ఆలోచించాల్సిన పరిస్థితిని ముందే క్రియేట్ చేస్తున్నట్టు చూడొచ్చు. ఈ బిల్లుపై మరీ అతిగా వ్యతిరేకత వ్యక్తం చేయడం ద్వారా ముస్లిం మైనారిటీల మనోభావాలను దెబ్బతింటాయేమో అనే అనుమానాలు వారిలోనే వ్యక్తమయ్యేట్టు చేస్తున్నారు.
ఇక, ఈ బిల్లుపై రెండు రకాల ప్రచారాలకు భాజపా సిద్ధమైనట్టు చెప్పుకోవచ్చు. రాజ్యసభలో ఎలాంటి అడ్డంకులూ లేకుండా ఈ బిల్లు బయటపడిపోతే… ముస్లిం మహిళల కష్టాలను తీర్చిన ధీరుడుగా మోడీని ప్రొజెక్ట్ చేస్తూ ప్రచారం చేసుకుంటారు. లేదూ.. రాజ్యసభలో ప్రతిపక్షాల అభ్యంతరాలు ఎక్కువై, మరోసారి ఈ బిల్లు లోక్ సభకు రావడం, ఈలోగా అసదుద్దీన్ వంటి వారు లేవనెత్తుతున్న కొన్ని అభ్యంతరాలకు మద్దతు పెరగడం లాంటివి జరిగితే… ముస్లిం మహిళల కోసం పోరాటం చేసిన తొలి నాయకుడిగా చిత్రం చేస్తూ ప్రచారం చేసుకుంటారు. ఈ తరహా ప్రచార వ్యూహంతో భాజపా సిద్ధమౌతోందనే కథనాలు ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఏదేమైనా, కాంగ్రెస్ పార్టీకి ఈ బిల్లుపై వ్యతిరేకత వ్యక్తం చేయాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితిని భాజపా ముందే క్రియేట్ చేసి పెడుతోంది.