పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వ తీరుపై కేంద్రం మరీ ముఖ్యంగా సంబంధిత మంత్రి నితిన్ గడ్కరీ ఆగ్రహంగా వున్నారని ఆయనను కలిసిన ప్రతిపక్ష నేతలు అంటున్నారు. నేనే చూసుకుంటానని కూడా ఆయన స్పష్టంగా చెప్పారట. ఈ లోగా కెనరా బ్యాంకు ట్రాన్స్‌ట్రారు దివాళా ఎత్తినట్టు ప్రకటించాలంటూ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడం మరో కుదుపు. త్వరలోనే గడ్కరీ పోలవరం సందర్శనకు వస్తారని రాష్ట్ర మంత్రి దేవినేని ఉమ కూడా ప్రకటించారు. అయితే ఇవన్నీ మామూలు సందర్శనలు కావనీ సంఘర్షణ వుందని ఢిల్లీకి వెళ్లివచ్చిన నాయకులు అంటున్నారు. ఈ కాలంలో సిపిఐ, వైసీపీ నేతలు నేరుగా ప్రధానిని కూడా కలసి వచ్చారు. మొత్తంపైన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపట్ల కేంద్రం అంతకంటే కూడా బిజెపి అసంతృప్తిగా వున్నట్టు స్పష్టమవుతున్నది. ఇది అంతిమంగా ఎలా పరిణమిస్తుందో చూడాలి. నిరాటంకంగా పని జరిగే పరిస్థితి మాత్రం లేదు.