అసెంబ్లీ సమావేశాలను ఏపీ విపక్షం వైకాపా బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే వరకూ శాసన సభకు వచ్చేది లేదంటూ వారు సభకు దూరమయ్యారు. అయితే, విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు కాబట్టి, ఆ ఏర్పాట్లకు అందుబాటులో ఉండాలి కాబట్టి, ఫిరాయింపు పేరుతో అసెంబ్లీకి ఎమ్మెల్యేలు దూరమయ్యారనే విమర్శలూ ఉన్నాయి. అంతేకాదు, తాజాగా ముగిసిన సమావేశాల్లో పోలవరం ప్రాజెక్టు, కాపుల రిజర్వేషన్లు వంటి కీలక అంశాలు చర్చకు రావడం.. ఆయా సందర్భాల్లో ప్రభుత్వాన్ని నిలదీసే ఒక మంచి అవకాశాన్ని వైకాపా జారవిడుచుకుందనే చర్చ కూడా జరిగింది. ప్రజా ప్రతినిధులు చట్టసభలను బహిష్కరించడమేంటని అభిప్రాయపడ్డవారూ లేకపోలేదు! అయితే, తాజాగా ఇదే అంశాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముందు ప్రస్థావించినప్పుడు ఆయన స్పందించారు.
రాజకీయ పార్టీల నిర్ణయాలపై తాను వ్యాఖ్యానించదలచుకోలేదన్నారు. చట్టసభలకు ప్రజాప్రతినిధులు రావాలనీ, వచ్చి చర్చించాలని వెంకయ్య నాయుడు అన్నారు. సభలో జరుగుతున్న చర్చలు, ఇతర అంశాలపై ఇష్టం లేకుంటే వాకౌట్ చేసి వెళ్లిపోవాలన్నారు. ఈ సందర్భంగా తాను శాసన సభ్యుడిగా ఉన్నప్పటి ఓ ఘటనను గుర్తుచేసుకున్నారు. ఓసారి.. సభ్యులంతా స్పీకర్ వెల్ లోకి దూసుకుని వెళ్లారనీ, పుచ్చలపల్లి సుందరయ్య కూడా అలానే వెళ్లి బల్లలు వాయించారన్నారు. ఆయన్ని చూసి తాను కూడా వెళ్లబోతుంటే.. పక్కనే ఉన్న తన గురువు తెన్నేటి విశ్వనాథం ఆపారన్నారు. ఆ మర్నాడు.. ఎవ్వరూ అడక్కుండానే, తనకు తానుగానే సుందరయ్య స్పందించి, సభలో తన ప్రవర్తనకు క్షమాపణలు చెప్పారన్నారు. నిజానికి ఆయన్ని క్షమాపణలు అడిగేంత ధైర్యం సభలో ఎవ్వరికీ లేదనీ, కానీ ఆయన సంస్కారానికి ఇది సాక్ష్యం అన్నారు.
అంతటి సంస్కారం నేటి తరం నాయకుల నుంచి ఆశించగలమా..? అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడాన్ని కూడా ఏదో గొప్ప పనిగా చెప్పుకుంటున్నారేగానీ… ప్రజా ప్రతినిధులుగా చట్టసభలకు వెళ్లాలనే బాధ్యతను విస్మరిస్తున్నామనే అభిప్రాయం వైకాపా నేతల్లో ఇప్పటికీ కనిపించడం లేదు. ఆ కోణం నుంచి తమను ఎన్నుకున్న ప్రజలకు వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా వైకాపా నుంచి లేదు. పోనీ, ఫిరాయింపులపై పోరాటం తీవ్రతరం చేశారా అంటే.. అదీ లేదు. జగన్ చేస్తున్న పాదయాత్రకు అందుబాటులో ఉండాలన్న ఒక్క కారణం తప్ప… అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించేందుకు వేరే సహేతుకమైన కారణం కనిపించడమే లేదు. అలాంటప్పుడు, వెంకయ్య లాంటివాళ్లు ఎలాంటి ఎన్ని గతానుభవాలు చెప్పినా… బాధ్యతను గుర్తు చేసే ప్రయత్నం చేసినా చెవికి ఎక్కుతుందా..?