ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అమరావతిలో మీడియాతో జరిపినఇష్టాగోష్టిలో అనేక అభిప్రాయాలు పంచుకున్నారు. 2019 తర్వాత సమాజసేవ చేస్తానన్నారు. భవిష్యత్తులో తాను ప్రధాని కావాలనుకోవడం లేదనీ ఆ అర్హత కూడా తనకు లేదని అన్నారట. అర్హత అన్నది పెద్ద మాట. ఆ మాట కన్నా అవకాశం అనేది మరింత బాగా కుదిరేది. వచ్చే ఎన్నికల్లో ఎలాగూ ప్రస్తుత ప్రధాని మోడీ నాయకత్వంలోనే బిజెపి పోరాడుతుంది. గెలిస్తే ఆయనే పీఠమెక్కుతారు. అలాగాక ఓడిపోతే అప్పుడు ఆ ప్రశ్నే వుండదు. కనుక వెంకయ్య గారి వైరాగ్య లేదా వైముఖ్య ప్రకటన వింతగా వుంది. వాస్తవానికి ఇంతవరకూ రాష్ఠ్రపతి ఉపరాష్ట్రపతి పదవుల్లో పనిచేసిన వారెవరూ మళ్లీ రాజకీయ పదవుల్లోకి రాలేదు. ఇప్పుడే ప్రణబ్ ముఖర్జీ కొంత రాజకీయ ఆసక్తిచూపుతున్నా అది ఆశీస్సులు సలహాలకే పరిమితం కావచ్చు. నిజం చెప్పాలంటే వెంకయ్య తర్వాతి దశలో రాష్ట్రపతి కావడం గురించి మాట్లాడొచ్చు. తమపార్టీయే గెలిచిన ఆ అవకాశం రాదని అనుకుంటున్నారా? ఇటీవలి కాలంలో కెఆర్ నారాయణన్‌ను మినహాయిస్తే ఎవరూ రాష్ట్రపతిగా ప్రమోషన్పొందలేదు. ఆయనను కూడా కావాలని ముందే అనుకుని ఉప రాష్ట్రపతిని చేశారు గనక తొలి దళిత రాష్ట్రపతి కాగలిగారు. మొత్తంపైన వెంకయ్య మాటలు వింటే ఇది ఎండ్ ఆప్ద రోడ్ అన్నట్టు ధ్వనిస్తుంది.