త్రిదండి చిన జియర్ స్వామి ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ చక్రం తిప్పుతున్న అపర రామానుజుడు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయన పట్ల చూపించే భక్తి శ్రద్ధలు అంతా ఇంతా కాదు. అధికార నివాసంలో తన స్థానంలో కూచోబెట్టి వినయం చూపించారు. షష్టిపూర్తిలో ఆరాధన చాటుకున్నారు. అన్నిటినీ మించి యాదాద్రిగా మార్చిన యాదగిరిలో జియర్ మాటలే పాటిస్తున్నారు. ఇంత చేసే కెసిఆర్ షష్టిపూర్తి వేదికపై పాదాభివందనం చేయబోతే స్వామి కాళ్లు వెనక్కు తీసుకోవడం అందరికీ దిగ్బ్రాంతి కలిగించింది. అయితే ఆయనను భక్తితో ఇంటికి పిలిచే సంపన్నులందరికీ ఇది తెలిసిన విషయమే. అంటుకుంటే ఆయన మహిమలు పోతాయని శిష్యులు చెబుతుంటారని నాకు విశ్వసనీయంగా తెలుసు. ఒక టీవీ ఇంటర్వ్యూలో ఈ విషయమై అడిగినపుడు జియర్ స్వామి నిస్సంకోచంగా సమర్థించుకున్నారు. అసలు ఎందుకు అంటుకోవాలని ఎదురు ప్రశ్నించారు. విద్యుత్‌బల్బును ఫ్యాన్‌ను ముట్టుకుంటామా అని అతకని ప్రశ్నలు వేశారు. తాము ఏదైనా దీక్షలో లేదా పూజలో వుంటే అంటుకోనివ్వబోమని కుండబద్దలు కొట్టి చెప్పేశారు. ఇది రాజ్యాంగం ఒప్పుకుంటుందో లేదో తెలియదు. పూజలు లోపల కావలసినట్టు చేసుకోవచ్చు గాని బయిటకు వచ్చిన తర్వాత తాకవద్దనడం తప్పవుతుంది కదా.. ఇక పోతే యాదాద్రికీ తిరుపతికి పోటీ లేదనడం ద్వారా కెసిఆర్ వూహించిన దాన్ని కొంచెం తగ్గించారు. దేని వైభవం దానిదే అని సూత్రం చెబుతూనే యాదాద్రి తిరుపతి కాదు అన్నారు. అయితే అంతకంటే ఎక్కువ కూడా కావచ్చునేమో అని ముక్తాయించారు. యాదగిరి వంటి ప్రసిద్ధనామాన్ని యాదాద్రిగా మార్చడం కూడా సమంజసమేనన్నారు. స్వాములు ఏం చేస్తే అది సరైంది..ఏది కాదంటే అది తప్పు. అయినా ప్రజలెన్నుకున్న ప్రభుత్వాధినేతలు వారిముందు సాష్టాంగపడతారు.ఏంచేస్తాం!