తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలుసుకున్నారు. తొలిసారిగా ప్రగతి భవన్ కు పవన్ కల్యాణ్ వెళ్లడం విశేషం. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు పవన్ వెళ్లారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. పవన్ ప్రగతి భవన్ కు పవన్ చేరుకోగానే.. అప్పటికే గవర్నర్ దగ్గరకి వెళ్లారు కేసీఆర్. దాంతో కొంతసేపు సీఎం కోసం పవన్ వేచి చూశారు. ఆయన వచ్చాక కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఈ ఇద్దరూ అర్ధ గంటకుపైగా వివిధ అంశాలపై చర్చించుకున్నట్టు సమాచారం.
ప్రపంచ తెలుగు మహాసభలకు తనను ఆహ్వానించినా రాలేకపోయానని సీఎంతో పవన్ చెప్పినట్టు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంతోపాటు, రాష్ట్రం ఏర్పాటైన తరువాతి పరిస్థితులపై ఈ ఇద్దరి మధ్య కొంత చర్చ జరిగినట్టు సమాచారం. అంతేకాదు, ఆంధ్రా రాజకీయాలకు సంబంధించి కూడా ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారట. తన దృష్టికి వచ్చిన కొన్ని తెలంగాణ రాష్ట్ర సమస్యల్ని కేసీఆర్ కు పవన్ వివరించినట్టు సమాచారం. సిద్ధిపేట చేనేత కార్మికులు, ఫ్లోరైడ్ సమస్యల గురించి పవన్ ప్రస్థావించినట్టు తెలుస్తోంది.
మొత్తానికి, ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. నిజానికి, ఉద్యమ సమయం నుంచీ తెరాస నేతలు పవన్ పై చాలా విమర్శలు చూస్తూ వచ్చారు. తాజాగా మంత్రి కేటీఆర్ కూడా పవన్ ను ఎనిగ్మా అంటూ ట్వీట్ చేశారు. అయితే, ఇది జరిగిన వారం రోజుల్లోపే సీఎంతో పవన్ భేటీ కావడం విశేషం. అంతేకాదు, గతవారంలో రాష్ట్రపతి కోవింద్ కు గవర్నర్ విందు ఇచ్చిన సందర్భంలో పవన్, కేసీఆర్ కాసేపు మాట్లాడుకున్నారు. అప్పట్నుంచే పవన్ విషయంలో తెరాస వైఖరి మారుతోందన్న సంకేతాలు వ్యక్తమయ్యాయి. ఈ తాజా భేటీ మర్యాదపూర్వకమైనదే అని జనసేన వర్గాలు చెబుతున్నా… రాజకీయంగా దీనికి ఉండాల్సిన ప్రాధాన్యత ఉంటుంది.
మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయి. ఆంధ్రాతోపాటు తెలంగాణలో కూడా అన్ని నియోజక వర్గాల్లోనూ పోటీ చేస్తానంటూ జనసేనాని ఇప్పటికే ప్రకటించారు. తెలంగాణలో కూడా పవన్ కల్యాణ్ కు మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పైగా ఆంధ్రాలో తెలుగుదేశానికి అత్యంత ప్రీతిపాత్రమైన నాయకుడు..! భాజపాతో కూడా ఉన్నంతలో సానుకూల సంబంధాలు కలిగి ఉన్నారనే చెప్పొచ్చు. తెలంగాణలో తెరాస రాజకీయ అవసరాలు కూడా మారుతూ ఉన్నాయి. కొత్త కూటములకు ఆస్కారం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వీలైనన్ని మార్గాల ద్వారా తమకు మద్దతు పెంచుకునే ప్రయత్నంలో తెరాస ఉంది! సో… ఆ మధ్య అనంతపురం పర్యటనకు కేసీఆర్ వెళ్లిన దగ్గర నుంచీ.. ఇప్పుడు పవన్ తో భేటీ వరకూ తెరాస వ్యూహాత్మకంగా ఉందనేది అర్థమౌతూనే ఉంది. కొన్ని సామాజిక సమీకరణాలను సరిచేసే ప్రయత్నంలో కేసీఆర్ ఉన్నట్టు అనిపిస్తోంది. కాబట్టి పవన్ విషయంలో కూడా మారిన ధోరణికి ఈ భేటీ మరో వేదికగా చూడొచ్చు.