సూపర్ స్టార్ రజినీకాంత్ పార్టీ పెడతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజకీయాల్లో ఆధ్యాత్మిక ధోరణి అంటూ ఓ కొత్త పంథాను ఆయన తెరమీదికి తీసుకొచ్చారు. కార్యరూపంలో అదెలా ఉంటుందో అనే స్పష్టత ఇంకా రావాల్సి ఉంది. అయితే, తాజాగా పార్టీకి సంబంధించిన వెబ్ సైట్, యాప్ లను విడుదల చేశారు. ఇచ్చిన హామీలను మూడేళ్లలోగా అమలు చేయకపోతే పార్టీని మూసేస్తానంటూ తలైవా ఓ వీడియో మెసేజ్ కూడా ఇచ్చారు. ఇంకోపక్క రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయని అంటున్నారు. అయితే, తమిళనాడులో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై ఢిల్లీలో కొంత ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఇతర పార్టీలో రజినీ రాజకీయాగమనాన్ని నిశితంగా పరిశీలిస్తుంటే… భాజపా మాత్రం తమిళనాట తమ పట్టు కోసం ఇదో అవకాశంగా మార్చుకునేందుకు మరోసారి ప్రయత్నం మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు. మొదట్నుంచీ రజినీ తమతో కలుస్తారనే ఆశాభావంతో వారున్నార్లెండి.
నిజానికి, రజినీ పార్టీ ప్రకటన చేయగానే భాజపా నేత సుబ్రహ్మణ్య స్వామి తీవ్రంగా వ్యతిరేకించారు. రజినీ నిరక్షరాస్యుడు అనేశారు. తమిళ రాజకీయాల నుంచి సినీ తారలను వెలేస్తే తప్ప సుస్థిరత రాదన్నారు. దేవుడిని నమ్మే రజినీకాంత్ ద్రవిడ రాజకీయాలు ఎలా చేస్తారంటూ ఆయన ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. అయితే, ఆయన వ్యాఖ్యలు ఎలా ఉన్నా… భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాత్రం రజినీ రాజకీయ ప్రవేశాన్ని ఆహ్వానిస్తూనే సానుకూలంగా స్పందించారు. తమ మద్దతు ఉంటుందన్నట్టుగా అమిత్ షా ప్రకటనలు చేస్తున్నారు. రజినీకాంత్ దీ తమదే ఒకే భావజాలం అని ఆయన అంటున్నారు. రాజకీయాల్లో ఆధ్యాత్మికత అని రజినీ అంటున్నారు కదా… భాజపాకి కనిపించిన సానుకూల్యత ఈ మాటలోనే ఉంది! అందుకే రజినీదీ తమ బాటే అని అమిత్ షా చెబుతున్నారు.
వాస్తవానికి తమిళనాడు రాజకీయాల్లో భాజపాకి ఇంకా పట్టు చిక్కలేదనే చెప్పాలి. అమ్మ జయలలిత మరణం తరువాత రాష్ట్ర రాజకీయాల్లో తమదైన పట్టు సాధన కోసం భాజపా చాలాప్రయత్నాలు చేసింది. అన్నాడీఎంకే వర్గాలను తమపై ఆధారపడే పరిస్థితి కల్పించే వ్యూహం రచించింది. అయితే, ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఫలితంతో వాస్తవం కొంత బోధపడింది. అన్నాడీఎంకే డిపాజిట్ కోల్పోవడానికి భాజపా వెనక ఉండటమే అనే విశ్లేషణలు ఉన్నాయి. భాజపా ఆధిపత్యాన్ని తమిళులు అంగీకరించే పరిస్థితి లేదన్నది అర్థమౌతోంది. అలాంటప్పుడు, భాజపా నుంచి ఆహ్వానం వచ్చినా, అమిత్ షా నుంచి సానుకూల ప్రకటనలు వెలువడ్డా.. రజినీ నుంచి పెద్దగా స్పందన ఉండే అవకాశం లేదనే చెప్పొచ్చు. కానీ, ఆధ్యాత్మికత అనే పాయింట్ ఆధారంగా చేసుకుని భాజపా తమ వంతు ప్రయత్నాలు చేస్తుందనేది కూడా వాస్తవం.