‘జగన్ ముఖ్యమంత్రి’ కావడం అనేది ఇంతవరకూ వైకాపా రాజకీయ లక్ష్యంగానే కనిపిస్తోంది! అంతేగానీ, దాన్ని మించి అది తమ అవసరం అని ప్రజలు అనుకునే స్థాయిలో జగన్ ఇప్పటికీ ప్రభావితం చేయలేకపోతున్నారన్నది విశ్లేషకుల మాట. జగన్ పాదయాత్ర 50వ రోజుకు చేరుకుంటోంది. ఇంతవరకూ ఆయన ప్రసంగాల్లో కేవలం కొన్ని హామీలు, చంద్రబాబుపై వ్యతిరేకతమాత్రమే కనిపిస్తున్నాయి. అవే తమని గట్టెక్కిస్తాయన్న వ్యూహంతో యాత్ర కొనసాగిస్తున్నారు. అయితే, ఇదే తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మరింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. పాదయాత్ర ద్వారా జగన్ ఏవైతే ప్రధాన సమస్యలు అని ఎత్తి చూపుతున్నారో… వాటిపై కూడా దృష్టి సారిస్తూ, విమర్శించే అవకాశాన్ని వైకాపా ఇవ్వకూడదనే ప్రయత్నంలో చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈరోజు నుంచి ప్రారంభం కాబోతున్న జన్మభూమి కార్యక్రమంలో రైతు రుణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒకేసారి లక్ష మంది రైతులకు రుణాలు ఇచ్చే కార్యక్రమం ఈ జన్మభూమిలోనే ఉంది. అంతేకాదు, అర్హులైనవారందరికీ పింఛెన్లు, ఇళ్లను పెద్ద సంఖ్యలో కేటాయించబోతున్నారు. ఇంకోపక్క సాగునీటి ప్రాజెక్టులు, రాజధాని నిర్మాణం, అభివృద్ధి పథకాలు… ఇవన్నీ చేస్తూనే, తనను మరోసారి ముఖ్యమంత్రిగా కొనసాగించాల్సిన అవసరాన్ని ప్రజల కోణం నుంచి చూపించే ప్రయత్నం చంద్రబాబు కూడా మొదలుపెట్టేశారని చెప్పుకోవచ్చు.
అమరావతిలో జన్మభూమి కార్యక్రమం గురించి మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాలూ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఒకట్రెండు స్థానాల్లో అనూహ్యంగా ఓడిపోయినా కూడా.. ఆ తరువాత అక్కడి ప్రజలు బాధపడాల్సిన పరిస్థితి వస్తుందనీ, టీడీపీని ఎందుకు ఓడించామా అని వారు విశ్లేషించుకోవాల్సి వస్తుందన్నారు. తన కష్టానికి కూలి ఇవ్వాలనీ, తాను చేస్తున్న శ్రమకు కూలీ దక్కాలా వద్దా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. సో.. చంద్రబాబు వ్యూహం చాలా స్పష్టంగా ఉంది. మరోసారి టీడీపీకి అధికారం ఇవ్వడం అనేది.. తాను పడుతున్న కష్టానికి ఇవ్వాల్సిన కూలిగా చెబుతున్నారు. ఆ దిశగా ప్రజలను మానసికంగా కొంత సంసిద్ధులను చేస్తున్నారు.
జగన్ లో మిస్ అవుతున్న కోణం ఇక్కడే ఉంది. చంద్రబాబుపై ఉన్న ప్రజా వ్యతిరేకతపైనే వైకాపా ఆధారపడుతోంది. దాన్నిమించిన మరో అంశం వారికి ప్రచారాస్త్రంగా కావాలి. ఫలానా కారణాలు, లేదా ఫలానా పరిస్థితుల నేపథ్యంలో ‘జగన్ ముఖ్యమంత్రి అయి తీరాల’నే భావన ప్రజలకు మరింత తీవ్రంగా కలిగించే అంశమేదీ ఇప్పటివరకూ వైకాపా దగ్గర ఉన్నట్టు అనిపించడం లేదు. కొన్ని జనాకర్షక హామీలు, చంద్రబాబుపై వ్యతిరేకత.. ఈ రెంటిపైనే ఆధారపడుతున్నారు. ఎన్నికల వరకూ వచ్చేసరికి ఇవి చాలవు అనే పరిస్థితి వైకాపా వ్యూహకర్తలకు అర్థమౌతోందో లేదో తెలీదు! పాదయాత్ర కొనసాగించడంతోపాటు ప్రచార వ్యూహాలకు మరింత పదును పెట్టాల్సిన అవసరాన్ని వారు గుర్తించాల్సిన తరుణమైతే కచ్చితంగా ఇదే..!