తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రగతి భవన్ లో కలుసుకున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ కోసం కనీసం ఓ గంటకుపైగా వేచి చూసి.. ఆ తరువాత మరో గంటపాటు ఇద్దరి మధ్యా చర్చలు జరిగాయి. దీంతో ఈ పరిణామం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. అయితే, జనవరి 1 నుంచి రైతులకు నిరంతరాయ విద్యుత్ ను కేసీఆర్ సర్కారు ఇస్తుండటం నచ్చిందనీ, అదెలా సాధ్యమైందో తెలుసుకునేందుకే తాను కేసీఆర్ దగ్గరకు వచ్చానంటూ పవన్ చెప్పారు. దీంతో పవన్ స్పందనపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి స్పందించారు. పవన్ కల్యాణ్ ను విమర్శించకుండానే, కేసీఆర్ తో ఆయన భేటీని విమర్శించడం విశేషం! పవన్ పై ఎక్కడా వ్యతిరేక భావన కలిగేలా మాట్లాడకుండానే, తెలంగాణ విద్యుత్ అంశాలకు సంబంధించి పవన్ కు సరైన అవగాహన లేదనేది అంతర్లీనంగా చెప్పారు.
ఈరోజున రైతులకు 24 గంటలు కరెంటు ఇస్తున్నారంటే… అందుకు కారణం నాటి కాంగ్రెస్ పార్టీ పాలనే అని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన తరువాత జనాభా ప్రాతిపదికనే పంపకాలు జరిగాయనీ, కానీ ఒక్క విద్యుత్ విషయంలో మాత్రం అలాంటి విభజన వద్దని నాటి తెలంగాణ కాంగ్రెస్ నేతలు పట్టుబట్టారనీ, అదే విషయాన్ని సోనియా గాంధీకి వివరించి ఒప్పించారని రేవంత్ చెప్పారు. జనాభా ప్రాతిపదిక ప్రకారం తెలంగాణకు అన్నింటా 42 శాతం, ఆంధ్రాకు 58 శాతం వాటాలు వచ్చాయన్నారు. కానీ, విద్యుత్ విషయానికి వచ్చేసరికి వినియోగం ఆధారంగా తెలంగాణకు 53.89 శాతం విద్యుత్ వచ్చిందన్నారు. అంతేకాదు, నాడు కాంగ్రెస్ హాయంలో భూపాలపల్లి, జూరాల వంటి ప్రాజెక్టులకు పునాదులు పడ్డాయనీ.. నేడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేసరికి ఆ పనులన్నీ పూర్తై, అదనపు విద్యుత్ వచ్చిందన్నారు. గృహ వినియోగానికి అవసరమైన నిరంతరాయ విద్యుత్ ను కేంద్ర ప్రభుత్వం ఉదయ పథకం కింద అన్ని రాష్ట్రాలకూ ఇచ్చిందన్నారు. ఇవన్నీ అనుకూలించాయనీ, కానీ తన కృషి వల్లనే 24 గంటల విద్యుత్ సాధ్యమైందని కేసీఆర్ చెప్పుకోవడం సరైంది కాదనీ, ఈ విషయాలు పవన్ తెలుసుకోవాలన్నారు.
ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో కేసీఆర్ సర్కారు చేసిన ఒప్పందాల్లో చాలా అవినీతి ఉందనీ, కాబట్టి కేసీఆర్ దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించొద్దని పవన్ కు విజ్ఞప్తి చేశారు. ‘ఏదో మంచి చేద్దామనే మీరు రాజకీయాల్లోకి వచ్చారు. మీరు కేసీఆర్ ను సమర్థిస్తున్నారు అంటే… అయితే అవగాహనా లోపమై ఉండాలీ, సమాచార లోపమైనా ఉండాలీ, లేదంటే కేసీఆర్ కూ మీకూ మధ్యలో ఏదైనా అవగాహన కుదిరిందని అనుమానించాల్సి వస్తుంది’ అని రేవంత్ వ్యాఖ్యానించడం విశేషం. ఢిల్లీ పెద్దలే కేసీఆర్ మాయలో పడ్డారనీ, అలాంటిది పవన్ కల్యాణ్ పడటంలో ఆశ్చర్యం ఏముందన్నారు. దీనికి సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని తెప్పించుకుని… తెలంగాణ ప్రజలకు పవన్ కల్యాణ్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని రేవంత్ డిమాండ్ చేశారు. తెలంగాణ అంశాలపై పవన్ కు అవగాహన లేదన్నట్టుగా రేవంత్ వ్యాఖ్యలున్నాయి. ఈ విమర్శలపై జనసేనాని ఎలా స్పందిస్తారో చూడాలి.