‘నేనే రాజు నేనే మంత్రి’తో ఫామ్‌లోకి వచ్చేశాడు తేజ. ఆ సినిమా విజయం.. ఆగ్ర కథానాయకుల దృష్టినీ ఆకర్షించింది. అందుకే తేజకు వెంకటేష్, బాలకృష్ణ నుంచి పిలుపు అందుకునేలా చేసింది. బాలయ్య అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ఎన్టీఆర్’ బయోపిక్‌ని తేజ చేతికి ఇచ్చాడంటే.. తేజపై ఉన్న నమ్మకం ఏపాటిదో అర్థం చేసుకోవొచ్చు. వెంకీ కూడా… తేజ బ్రాండ్‌పై నమ్మకంతో ఓకే అన్నాడు. ఇటీవల వెంకీ సినిమాకి కొబ్బరికాయ్ కొట్టారు. బాలయ్య సినిమా కంటే ముందు వెంకీ సినిమా మొదలవుతుందనుకున్నారు. అయితే ఇప్పుడు తేజ ప్లాన్ మారింది. ముందు బాలయ్య తో బయోపిక్ పై ఆయన దృష్టి సారిస్తారని సమాచారం.
ఇటీవలే ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ మొదలైంది. టీజర్కోసం కొన్ని షాట్స్ తీశారు. మార్చి నుంచి రెగ్యలర్ షూటింగ్ మొదలెట్టి ఇదే యేడాది ఈ సినిమాని విడుదల చేయాలని బాలయ్య భావిస్తున్నాడట. అందుకోసం వెంకీ సినిమాని తాత్కాలికంగా పక్కన పెట్టబోతున్నట్టు సమాచారం. ఇందుకు సురేష్ బాబు నుంచి కూడా అనుమతి తీసుకున్నాడట తేజ. బాలయ్య సినిమా చేస్తూ.. మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు వెంకీ సినిమా పనులు మొదలెట్టాలని తేజ భావిస్తున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్‌కి సంబంధించిన ప్లానింగ్ ఓ కొలిక్కి వస్తే గానీ, వెంకీ సినిమా ఎప్పుడన్నది తెలీదు. ఒకటి మాత్రం ఖాయం.. ఇప్పుడు తేజ దృష్టి పూర్తిగా ఎన్టీఆర్ బయోపిక్‌పైనే ఉంది.