రజనీకాంత్ రాజకీయ ప్రకటన తమిళ నాడు రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులకు అంకురార్పణ చేసినట్టైంది. సినీ ప్రముఖులు కొందరు రజనీకాంత్ పార్టీలో చేరడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అందులో రాఘవ లారెన్స్ ఒకడు. రజనీని స్ఫూర్తిగా తీసుకుని లారెన్స్ కూడా రాజకీయాల్లో అడుగుపెట్టడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. గురువారం సాయింత్రం 4 గంటలకు రాజకీయ ప్రవేశంపై లారెన్స్ ఓ ప్రకటన చేస్తాడని సమాచారం. రజనీకాంత్‌కి మద్దతుగా… ఆయన పార్టీలో చేరడానికి లారెన్స్ సిద్ధమవుతున్నాడని మీడియా వర్గాలు చెబుతున్నాయి. రాజకీయ ప్రకటన అనంతరం.. రజనీని లారెన్స్ కలవబోతున్నాడని సమాచారం. రాజకీయాల్లోకి వస్తానని రజనీ చెప్పినప్పటికీ, పార్టీ విషయాన్ని గానీ, విధివిధానాలను గానీ ఇంకా ప్రకటించలేదు. అప్పుడే.. రజనీ పార్టీలోకి చేరడానికి చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు. లారెన్స్ అంటే రజనీకి ప్రత్యేకమైన అభిమానం. ఇద్దరూ రాఘవేంద్రస్వామి భక్తులే.