రాజకీయాల్లో రహస్యానికే ప్రాధాన్యత ఎక్కువ ఉండాలి. నేటి ఫిరాయింపు రాజకీయాల సీజన్లో గోప్యత చాలాచాలా అవసరం. ఎవరు ఎప్పుడు పార్టీలోకి వస్తారు, ఇతర పార్టీలకు చెందినవారు తమతో టచ్ లో ఉన్నారు… ఇలాంటి అంశాలపై ముందుగా లీకులిస్తే, ఇతర పార్టీలు ఊరకుంటాయా..? మరి, ఈ మర్మం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలుసో లేదో..! పార్టీలో చేరిక విషయమై హైదరాబాద్ లో ఉత్తమ్ మాట్లాడారు. సంక్రాంతి పండుగ తరువాత కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయన్నారు. తెరాస ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్ లో ఉంటున్నారు అన్నారు. అయితే, ఆ తెరాస నేతలు కాంగ్రెస్ లోకి ఎప్పుడు చేరాలనే అంశమై ఇంకాస్త స్పష్టత రావాల్సి ఉందని చెప్పారు. అంతేకాదు… రాష్ట్రంలోని ఒక కీలక నేత తమలో టచ్ లో ఉన్నారనీ, త్వరలోనే కాంగ్రెస్ లోకి రాబోతున్నట్టు ప్రత్యేకంగా చెప్పడం విశేషం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అత్యంత అనుకూలమైన పరిస్థితి ఉందనీ, తెరాస సర్వే చేయించుకున్నా కూడా తమకే అనుకూలంగా వస్తుందని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. జనవరిలో కొన్ని పెద్ద తలకాయలు పార్టీలోకి వస్తాయనీ, ఆ తరువాత ఈ నెలా, లేదా ఫిబ్రవరిలో రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తారని ఉత్తమ్ చెప్పారు.
తెరాస ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉంటే ఉండొచ్చుగానీ… ఇలా బహిరంగంగా చెప్పడం సరైన వ్యూహం ఎలా అవుతుంది..? ఇలాంటి ప్రకటనలను కేసీఆర్ చూస్తూ ఊరకుంటారా చెప్పండీ..! ఆ మధ్య ఉమా మాధవరెడ్డి విషయంలో ఎదురైన అనుభవాన్ని ఉత్తమ్ మరచిపోయినట్టున్నారు. టీడీపీ కీలక నాయకురాలు ఉమా మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉంది. ఆ మేరకు చర్చలు జరిగాయనీ, ఉమా మాధవరెడ్డితోపాటు ఆమె కుమారుడు సందీప్ రెడ్డికి కూడా టిక్కెట్లు ఇచ్చే విషయమై కాంగ్రెస్ పార్టీ భరోసా కల్పించిందని ఆ మధ్య భారీ ఎత్తున ప్రచారం జరిగింది. కానీ, చివరికి వచ్చేసరికి ఏమైంది..? తన కుమారుడితో సహా ఆమె తెరాసలో చేరిపోయారు. కాంగ్రెస్ నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతోనే ఆమె తెరాస వైపు వెళ్లినట్టు కూడా కథనాలు వచ్చాయి.
చేరికల విషయంలో కేసీఆర్ వ్యూహాన్ని ఉత్తమ్ ఇంకా అర్థం చేసుకుంటున్నారో లేదో అనుమానం. కీలక నేతలు ఎవరైనాసరే.. తెరాసలోకి రాకపోయినా ఫర్వాలేదు, కానీ కాంగ్రెస్ లో మాత్రం చేరకూడదనే పథక రచనతో ఉన్నారు. ఒక కీలక నేత మా పార్టీలోకి వచ్చేస్తున్నారూ అని ఉత్తమ్ ఇలా ఓపెన్ గా చెబుతుంటే… అధికారంలో ఉన్న తెరాస చేయాల్సిన ప్రయత్నాలు చేయకుండా ఉంటుందా చెప్పండీ..! ఉమా మాధవరెడ్డి చేరిక విషయంలో ఎదురైన అనుభవమే పునరావృతం కాదనే నమ్మకం ఉత్తమ్ కి ఉందా..?