ఎన్నికలకు సమయం దగ్గరపడుతోందంటే చాలు… అధికార పార్టీలకు మరింత బాధ్యత పెరిగిపోవడం సహజం! ప్రస్తుత జన్మభూమి కార్యక్రమమే అందుకు నిదర్శనం. ముఖ్యమంత్రి మొదలుకొని, మంత్రులూ ఎమ్మెల్యేలూ నియోజక వర్గ స్థాయి నాయకుల్లో చాలా హడావుడి కనిపిస్తోంది. అమలు చేస్తున్న అభివృద్ధి పథకాల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడంతోపాటు… కొత్తగా పెద్ద సంఖ్యలో పెన్షన్లు, ఇళ్లు, రైతుల రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమౌతోంది. ఇంకోపక్క… రైతు రుణమాఫీలపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. వీటన్నింటికీ బడ్జెట్ ఎలా..? రాష్ట్రంలో అప్పుల్లో ఉందనీ, జీతాలు ఇచ్చేందుకు కూడా నిధులు సరిపోవడం లేదని ఎప్పటికప్పుడు చెబుతుంటారు! నిజానికి.. ఆ పరిస్థితి ఉంది కాబట్టే.. సంక్షేమ పథకాల అమలులో కొంత జాప్యం జరుగుతోందన్న విమర్శ ఎప్పట్నుంచో ఉంది. అయితే, ఈ వాస్తవాన్ని ఎవరు ఒప్పుకుంటారు చెప్పండీ..? అలాగని ఆలస్యానికి ఏదో ఒక కారణం ప్రజలకు చెప్పాలి కదా. సంక్షేమ పథకాల అమలు కొంత ఆలస్యం కావడానికి కారణం… ప్రభుత్వం ఆచితూచి అడుగు వేయడమే అన్నట్టుగా యనమల చెప్పారు!
జన్మభూమి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామక్రిష్ణుడు మాట్లాడుతూ… గత ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇంకా రూ. 20 వేల కోట్ల లోటుతో నడుస్తోందని చెప్పారు! అయినాసరే, వచ్చే ఆర్థిక సంవత్సరానికి మెరుగైన బడ్జెట్ రూపకల్పన చేసేందుకు కసరత్తు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు కూడా అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. తాళం తన దగ్గరే ఉన్నప్పటికీ, ఖజానా ఖాళీగా ఉందని యనమల చమత్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దాదాపు పద్నాలుగు లక్షల ఇళ్లు నిర్మించామని వారు చెప్పుకుంటున్నారనీ, కానీ ఆ పార్టీ నేతలు దాదాపు రూ. 6 వేల కోట్లు దోచుకున్నారని యనమల ఆరోపించారు. అందుకే, సంక్షేమ పథకాల అమలు విషయంలో తమ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోందని యనమల చెప్పడం విశేషం!
ఈ మాట ద్వారా రెండు విషయాలను యనమల చెబుతున్నట్టుగా ఉంది! మొదటిది… లోటు బడ్జెట్ ఉందని చెప్పడంతోపాటు, పథకాల అమలులో జాప్యానికి అదొక కారణం అని చెప్పకనే చెబుతూ ఉండటం. రెండోది… సంక్షేమ పథకాల పేరుతో నేతలకు దోచుకునే ఆస్కారం ఇవ్వకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని చెప్పడం. అంటే, సొంత పార్టీ నేతలపై ఇప్పటికీ నమ్మకం లేదని యనమల చెబుతున్నట్టా అనే అనుమానం ఎవ్వరికైనా కలుగుతుంది కదా. క్షేత్రస్థాయిలో జన్మభూమి కమిటీలు మొదలుకొని రాష్ట్రం వరకూ అంచెలంచెలుగా ఒక వ్యవస్థ ఉంది. సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారుల గుర్తింపు వంటి అంశాలపై ఎక్కడికక్కడ జవాబుదారీతనం ఉందని వారే చెబుతారు. అలాంటప్పుడు ఆచితూచి అడుగులేయాల్సిన అవసరం ఏముంది..? నిధుల దుర్వినియోగం కాకూడదన్న కారణంతో.. సంక్షేమ పథకాల అమలును ఆలస్యం చేశామని చెబుతుంటే, వినడానికి కాస్త విడ్డూరంగా అనిపిస్తోంది. అప్రమత్తత అవసరమే. కానీ, ఆలస్యానికి అసలు విషయం ఆర్థిక లోటు. దాన్ని యనమల నేరుగా ఒప్పుకోకుండా ఇలా విశ్లేషిస్తున్నారు. మధ్యలో గత కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు చూస్తూనే… తమ పార్టీ నేతలపై కూడా డౌట్ పడుతున్నట్టు మాట్లాడుతున్నారు.