నా పేరు పేరు సూర్య – నా ఇల్లు ఇండియా.. టీజర్ హల్ చల్ చేస్తోంది. సూర్య లోని ‘కోపం’ ఈ టీజర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కథంతా.. సూర్య కోపం చుట్టూనే తిరగబోతోంది. తొలి చిత్ర దర్శకుడిగా వక్కంతం వంశీ ఈ పాయింట్‌ని ఎలా తీసుకొచ్చాడా? అనే ఆసక్తి మొదలైంది. అయితే…. ఈ కథకీ, అందులోని కోపానికీ… ఎన్టీఆర్‌కీ ఓ లింకు ఉంది. అదేంటంటే…. వక్కంతం వంశీ ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయాల్సింది. టెంపర్ సినిమాకి ముందే.. ఎన్టీఆర్ కోసం ఓ కథ సిద్ధం చేశాడు. అయితే.. అది పట్టాలెక్కలేదు. ఇప్పుడు అదే కథని.. బన్నీతో ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ గా తీసుకొచ్చాడు. ఎన్టీఆర్ కి స్వతహాగా కోపం ఎక్కువ. బయట ఎలా ఉన్నా… అతన్ని దగ్గరుండి చూసే వాళ్లకు ఈ విషయం బాగా అర్థం అవుతుంది. నిజాయతీ పరుడికీ, దేశభక్తుడికీ ఎన్టీఆర్‌లా కోపం ఉంటే ఏమవుతుంది? అనే పాయింట్ దిశగా.. కేవలం ఎన్టీఆర్ కోసమే ఈ కథ రాసుకున్నాడు. ఇప్పుడు అదే… బన్నీ సినిమాగా మారిందన్నమాట. అయితే చిత్రబృందం మాత్రం ‘ఇది ఎన్టీఆర్ కోసం అనుకున్న కథ కాదు.. అది వేరే’ అని చెబుతున్నా – ఫిల్మ్ నగర్ వర్గాలు మాత్రం ఇది ఎన్టీఆర్ కోసం రాసుకున్నదే, ఎన్టీఆర్‌కి ఉన్న కోపం చుట్టూనే ఈ కథ పుట్టింది అని చెబుతున్నారు. అవునో కాదో తెలియాలంటే దర్శకుడు వంశీ నోరెత్తాల్సిందే.