పాత ప్రేమనే, కొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు నవతరం దర్శకులు. ప్రేమ కథని ఎంత సహజంగా వీలైతే అంత సహజంగా తెరకెక్కించడమే న్యూ ఏజ్ లవ్ స్టోరీల్లోని గమ్మత్తు. ఈమధ్య వచ్చిన పెళ్లి చూపులు, మెంటల్ మదిలో, మళ్లీ రావా ఇలాంటి కథలే కదా. ఇప్పుడు ఈ జాబితాలో చేరడానికి మరో సినిమా వచ్చేసింది. అదే.. రంగుల రాట్నం. రాజ్ తరుణ్, చిత్రా శుక్లా జంటగా నటించిన చిత్రమిది. ఈ సంక్రాంతికి విడుదల అవుతోంది. ఇప్పుడు ట్రైలర్ వచ్చేసింది.
ఉయ్యాల జంపాల తరవాత.. అంత సెన్సిబులిటీస్ ఉన్న లవ్ స్టోరీలు చేయలేదు. లవ్, యాక్షన్ జోనర్లో సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. మరోసారి.. ఉయ్యాల జంపాలా లాంటి కథ ఎంచుకున్నాడనిపిస్తుంది. తల్లీ – కొడుకుల కథకి, లవ్ యాంగిల్ ముడిపెట్టినట్టు తెలుస్తోంది. ప్రేమలో అమ్మాయిలు పెట్టే కండీషన్లు మొదట్లో బాగానే ఉన్నా.. అలవాటయ్యే కొద్ది.. విసుగు ఏర్పడుతుంటుంది. లవ్‌లో అగాధం ఏర్పడ్డానికి కారణం అదే. దాన్నే… చాలా సున్నితమైన కోణంలో తెరకెక్కించినట్టు అనిపిస్తోంది. యూత్‌ని ఆకర్షించే అంశాలు ఈ ట్రైలర్లో చాలానే ఉన్నాయి. రాజ్ తరుణ్… చాన్నాళ్ల తరవాత పక్కింటబ్బాయిలా కనిపిస్తున్నాడు. కొత్తమ్మాయి చిత్ర కూడా పద్దతిగా ఉంది. మొత్తానికి థియేటర్‌కి వెళ్లి సినిమా చూడాలన్న ఇంపాక్ట్ కలిగించడంలో ఈ ట్రైలర్ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి.