కడప జిల్లాలో జన్మభూమి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటైన సభకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కడప వైకాపా పార్లమెంటు సభ్యుడు అవినాష్ రెడ్డి కూడా వచ్చారు. స్థానిక సమస్యలపై సభలో మాట్లాడేందుకు ఆయన్ని వేదికపైకి పిలిచి, మైక్ ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి పాలన గురించి, జిల్లాకు ఆయన చేసిన సేవల గురించి, ఆయన హాయంలో శంకుస్థాపనలు చేసిన ప్రాజెక్టుల గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. దీంతో సభలో కొంత అలజడి రేగింది. సభా ప్రాంగణంలో ఉన్న టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చివరికి చంద్రబాబు నాయుడు స్వయంగా జోక్యం చేసుకుని అవినాష్ రెడ్డితో మాట్లాడారు..!
అవినాష్ రెడ్డి మాట్లాడుతూ... గండికోట చిత్రావతి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు అన్నారు. కానీ, ఆ పథకం వ్యయం రూ. 13 వందల కోట్లు అయితే… దాన్ని మనందరి ప్రియతమ నేత, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు అని చెప్పారు. రూ. 11 వందల కోట్లు ఖర్చు చేసి, 85 శాతం పనులను పూర్తి చేసిన ఘనత వైయస్ కు దక్కుతుందన్నారు. పులివెందుల సస్యశ్యామలం కోసం వైయస్ చేసిన కృషిని ఏ ఒక్క రైతూ మరవలేడు అని చెప్పారు. సరిగ్గా ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైకు అందుకున్నారు. అవినాష్ రెడ్డి దగ్గరకి వచ్చి… ఇది రాజకీయ మీటింగ్ కాదంటూ చెప్పారు. ఈలోగా కొంతమంది అవినాష్ నుంచి మైకు లాక్కునే ప్రయత్నం చేస్తే, వారినీ ముఖ్యమంత్రి వారించారు.
ఇది ప్రభుత్వ కార్యక్రమమనీ, పొగుడుకునే కార్యక్రమం కాదన్నారు. ఇక్కడ గౌరవంగా మీటింగ్ జరగాలనీ, ఎవరేం చేశారో చెప్పుకునే వేదికలు వేరేగా ఉంటాయని సీఎం అన్నారు. ఈ రోజున నీళ్లు తాను ఇచ్చాననీ, ఆ విషయం తాను ఇక్కడ చెప్పలేదని గుర్తించాలని అవినాష్ కి చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలకు వచ్చి గొప్పలు చెప్పుకుంటే ఇక్కడ హర్షించేవారు ఎవ్వరూ లేరన్నారు. ఏ ప్రజాప్రతినిధులైనా సరే, గౌరవంగా వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తే.. ఆ సమస్యలపై తాను స్పందిస్తానని ముఖ్యమంత్రి అన్నారు. ఆ తరువాత కూడా అవినాష్ మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే.. ఏవైనా సమస్యలు ఉంటే తనకు రాసివ్వాలని చెప్పారు. దీంతో అవినాష్ అక్కడి నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.
ఇక, ఈ ఘటనపై అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎవరి వాదన వారు వినిపించడం మొదలుపెడతారనడంలో సందేహం లేదు. తమ పార్టీ నేత మాట్లాడుతుంటే దౌర్జన్యంగా మైకు లాక్కున్నారనే కోణాన్ని వైకాపా ఎత్తుకుంటుంది..! జన్మభూమి లాంటి సభల్లో కూడా ప్రజల సమస్యలు ప్రస్థావించకుండా రాజకీయ ప్రయోజనాల కోసం వైకాపా నేతలు పాకులాడుతుంటారంటూ టీడీపీ వాదన ఉంటుంది.