ఎన్టీఆర్ బయోపిక్‌కి రంగం సిద్దం అవుతోంది. మార్చిలో ముహూర్తం నిర్ణయించాడు నందమూరి బాలకృష్ణ. ఈ యేడాదే ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది బాలయ్య వ్యూహం. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందుతున్నాయి. తేజ ముందున్న అసలు సమస్య కాస్టింగ్. ఎన్టీఆర్ కథంటే.. ఏఎన్నార్, ఎస్వీఆర్, సావిత్రి ఇలా చాలామంది ప్రముఖుల్ని చూపించాలి. అప్పటి రాజకీయ నేతల్నీ చూపించాలి. వాళ్లందరి కోసం ఏం చేయాలి?? అనేది ప్రధాన సమస్యగా మారింది. బసవతారకం లాంటి పాత్రలు కూడా కథలో కీలకం. వాళ్లందరినీ చూపించాలా? వద్దా…?? చూపించాల్సివస్తే ఏ పాత్రకు ఎవరిని తీసుకోవాలన్న విషయంపై అటు తేజ, ఇటు బాలయ్య ఇద్దరూ తర్జనభర్జనలు పడుతున్నారు. మరీ ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు పాత్ర ని ఎవరిని ఎంచుకోవాలన్న సమస్య ఉత్పన్నమవుతుంది. ఆ పాత్రకు గానూ అక్కినేని కుటుంబం నుంచి ఎవరినో ఒకరిని ఎంచుకొంటే బాగుంటుందన్నది తేజ ఆలోచన. అయితే… ఈమధ్య నందమూరి – అక్కినేని కుటుంబం మధ్య బాగా గ్యాప్ వచ్చింది. అందుకే అక్కినేని కుటుంబం నుంచి ఎంచుకోవాలన్న ఆలోచనకు బాలయ్య గట్టిగా నో చెప్పినట్టు సమాచారం.
వీలైనన్ని తక్కువ పాత్రలు ఉంటే బాగుంటుందని, పాత్రల ఎంపిక కోసం ఎక్కువ ఆలోచించవద్దని బాలయ్య చెబుతున్నాడట. కెమెరా ఎంతగా బాలయ్య మీదే ఫోకస్ అయినా సరే… ఏఎన్నార్, చంద్రబాబులాంటి పాత్రల్ని చూపించాల్సి వస్తుంది. బసవతారకం, లక్ష్మీ పార్వతి పాత్రలకూ ప్రాధాన్యం ఇచ్చి తీరాల్సిందే. ఈ పాత్రల ఎంపిక అనుకున్నంత సులభం కాదు. ఇప్పటికే సావిత్రి బయోపిక్‌గా రూపొందుతున్న ‘మహానటి’ కోసం చాలా కష్టపడ్డారు. అందులోనూ ఎస్వీఆర్ లాంటి దగ్గజాలను పోలిన పాత్రలున్నాయి. వాళ్లకీ కొంతమంది నటీనటులు ఇప్పటికీ దొరకడం లేదు. ఈ నేపథ్యంలో సరిగ్గా అదే సమస్య.. ఆ మాటకొస్తే అంతకంటే పెద్ద తలనొప్పి తేజకు చుట్టుకున్నట్టైంది. మరి ఇందులోంచి తేజ ఎలా బయటపడతాడో!!