కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ సర్కారు ఓ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. మంజునాథన్ కమిటీ నివేదిక ఆధారంగానే కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని చెబుతూ ఆ మధ్య అసెంబ్లీలో ఓ తీర్మానం ఆమోదించేశారు. దీంతో చంద్రబాబు సర్కారుకు కొంత ఊరట లభించినట్టు అయింది. ఎన్నికల నాటికి కాపుల ఉద్యమం ప్రభావం మరింత పెరిగి, టీడీపీకి రాజకీయంగా కొంత ఇబ్బంది కలుగుతుందేమో అనే వాతావరణం నెలకొన్నమాట వాస్తవమే. అయితే, కొన్ని నెలల కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో కాపు నేతలతో మీటింగ్ ఏర్పాటు చేయడం, ఆ సమయంలో మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో కాపుల సమస్యలను చంద్రబాబు విని స్పందించిన సంగతి తెలిసిందే. నిజానికి, అక్కడి నుంచే ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో అప్పటివరకూ కొనసాగుతూ వస్తున్న కాపుల ఉద్యమం తీవ్రత తగ్గించినట్టయింది! కానీ, ఇప్పుడు మరోసారి ఉద్యమం తప్పదన్నట్టుగా ముద్రగడ మాట్లాడుతున్నారు.
కాపుల రిజర్వేషన్ల విషయంలో తమకు ఇప్పటికీ సంతృప్తి లేదని ముద్రగడ తాజాగా అన్నారు. మార్చి 31 లోపు తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే, మరోసారి ఉద్యమించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. కాపుల డిమాండ్ మేరకు చంద్రబాబు సర్కారు స్పందనపై తమ జాతి కొంతమేర మాత్రమే సంతోషించిందన్నారు. తమకు పూర్తి పండుగ ఇంకా రాలేదన్నారు. తమ కాపు సోదరులు ఎమ్మార్వో ఆఫీస్ కి వెళ్లి, కుల ధ్రువీకరణ పత్రం కోరితే.. బీసీ అని ఇచ్చినప్పుడే పూర్తిగా సంతోషిస్తామని ముద్రగడ చెప్పారు. కాపుల ఉద్యమం ఇంకా ఆపలేదనీ, అది లైవ్ లో ఉందని చెప్పడం విశేషం. మార్చి 31 లోగా అన్నీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామనీ, ఒకవేళ ఆ తరువాత కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోతే కార్యాచరణ అప్పుడు ఉంటుందని చెప్పారు. ఇదే సందర్భంలో పవన్ కల్యాణ్ గురించి ప్రస్థావన వస్తే… ఆయన్ను వ్యక్తిగతంగా తాను ఎప్పుడూ కలవలేదని ముద్రగడ చెప్పారు. సినిమాల రీత్యా పవన్ ను చూస్తుంటాననీ, వ్యక్తిగతంగా మాత్రం పరిచయం లేదని స్పష్టం చేశారు.
ముద్రగడ నేతృత్వంలోని ఉద్యమం నెమ్మదిగా నీరుగారుతోందనే భావన ఈ మధ్య వ్యక్తమౌతూ వస్తోంది. కానీ, ముద్రగడ మాత్రం ఇంకా ఉద్యమం ఉందనే అంటున్నారు! కాపు నేతలతో చర్చలు సాగిస్తున్నామంటున్నారు. మార్చి 31 తరువాత మళ్లీ ఉద్యమించాల్సిన పరిస్థితులు వస్తాయనే చెబుతున్నారు. నిజానికి, రిజర్వేషన్ల అంశమై ఏపీ సర్కారు చేయాల్సింది చేసేసింది. ఇక మిగిలింది కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర. అది ఎప్పుడు జరుగుతుందో అనేది టీడీపీ కూడా ఇప్పుడు చెప్పలేని పరిస్థితిలో ఉంది! కానీ, ఈలోగా మరోసారి ఉద్యమానికి ముద్రగడ సిద్ధమౌతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు సర్కారు స్పందన ఎలా ఉంటుందో చూడాలి.