ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు అప్పటి టిఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు ఎస్సిఎస్టి కమిషన్ చైర్మన్ పదవి లభించడంతో ఒక స్థాయి ఆశావహుల జాబితా పూర్తయినట్టే. హరీశ్‌రావుకు బాగా సన్నిహితుడుగా పేరున్న ఎర్రోళ్ల ఎంతో కాలంగా ఈ నియామకం కోసం ఎదురు చూస్తూ కూచున్నారు. తన తర్వాత వచ్చిన చాలా మంది పెద్ద పెద్ద పదవులు ప్రాపకాలు పొందుతున్నా తనకు మాత్రం ఎలాటి సంకేతం రాకపోవడం ఆయనను చాలా ఘర్షణకు గురి చేసిన మాట నిజం. హరీశ్ రావు తమ తరపున సిఫార్సు చేస్తే మరీ నష్టమని ఇలాటివారు ఆయనను మాట్లాడవద్దని కోరారు. టిఆర్ఎస్ అంతర్గత వైరుధ్యాలలో హరీశ్‌పై గురి పెరుగుతున్న కొద్ది ఇలాటివారు మరింత నిరుత్సాహంలోనూ అయోమయంలోనూ కూరుకుపోతూ వచ్చారు. కాని కెసిఆర్ రెండేళ్ల తర్వాత నెమ్మదిగా వీరిలో కొందరికి పదవులు ఇవ్వడం ప్రారంభించారు. కాని అ సమయంలోనే ఎర్రోళ్లకు ఎలాటి హామీ లభించింది లేదు. వరంగల్ పార్లమెంటు సీటుకు మంత్రి కడియం శ్రీహరి రాజీనామా చేసినప్పుడు ఆ సీటు తనకు వస్తుందేమోనని ఒక ఇంటర్వూలో అడిగితే బయిటి వారికి అవకాశముండదని ఆయన కుండబద్దలు కొటిట చెప్పారు. ఏమైనా సరే పార్టీతోనే వుంటే మంచిదని శ్రేయోభిలాషులు చెప్పిన మాట మేరకు తను సహనంగా ఎదురుచూస్తూ వచ్చారు.ఎట్టకేలకు ఆయనను చైర్మన్‌గా చేశారు. అయితే పదవుల్లోకి వచ్చాక వీరిలో కొందరు హరీశ్‌తో పూర్వంలాగా వుండటం లేదన్న ఫిర్యాదు వుంది. పదవులు ఇవ్వడం ఆయన శిబిరాన్ని బలహీనపర్చడం కోసం అనే మాట కూడా వినిపిస్తుంటుంది.ఎర్రోళ్ల పదవీ ప్రకటన తర్వాత హరీశ్‌ను కలసి కృతజ్ఞతలు చెప్పడం ద్వారా ఆ ఫిర్యాదుకు అవకాశం లేకుండా చేసుకున్నారు. కాని ముందు ముందు తన కమిషన్ పనిపైనే కేంద్రీకరించే అవకాశం ఎక్కువగా వుంది. ఇక ఇప్పుడు కెసిఆర్ ఇంకా దిగువ స్థాయి కార్యకర్తలకు నాయకులకు పదవుల పునరావాసం కల్పించే ప్రక్రియ మొదలు పెడతారట.