ట్రిపుల్ తలాక్.. గడచిన కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ప్రతీరోజూ అత్యంత చర్చనీయం అవుతున్న విషయం. మూడుసార్లు తలాక్ అని చెప్పినంత మాత్రాన విడాకులు అయిపోయినట్టే అనే సంప్రదాయానికి చరమగీతం పాడాలన్న ఉద్దేశంతో ఈ బిల్లును పార్లమెంటు వరకూ భాజపా సర్కారు తెచ్చింది. ఉద్దేశం మంచిదే. అందుకే లోక్ సభలో ఈ బిల్లు పాస్ అయిపోయింది. రాజ్యసభకు వచ్చేసరికి… ప్రతిపక్ష పార్టీలు మోకాలడ్డుతున్నాయి. బిల్లులో కొన్ని మార్పులు చేయాలనీ, సెలక్షన్ కమిటీకి పంపాలంటూ పట్టుబడుతున్నాయి. ఎట్టి పరిస్ఠితుల్లోనూ మార్పులు సాధ్యం కాదనీ, యథాతథంగా బిల్లు ఎలా ఆమోదం కాదో మేమూ చూస్తామంటూ భాజపా కూడా పట్టుబట్టుకుని కూర్చుంది. ఈ బిల్లుపై రాజ్యసభలో కాంగ్రెస్ తో సహా కొన్ని పార్టీలు కొంత వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంలో అన్నాడీఎంకేతోపాటు టీడీపీ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సభలో గులామ్ నబీ ఆజాద్ చెప్పారు. కనీసం ప్రతిపక్షాల వాదన కూడా వినకుండా.. బిల్లుపై అధికార పార్టీ ఇంత మొండిగా ఎందుకు వెళ్తోంది..? దీనికి వెనక ఏదైనా రాజకీయ లబ్ధి కోణం ఉందా అంటే.. కచ్చితంగా ఉందనే చెప్పొచ్చు.
మార్పులకు ససేమిరా అనడంతోపాటు.. కాంగ్రెస్ ని మైనారిటీ వ్యతిరేకులుగా చిత్రించే పనిలో కమలనాథులు ఉన్నారనడంలో సందేహం లేదు. ఎందుకంటే, భాజపా అంటే మొదట్నుంచీ వ్యతిరేకించే ముస్లింలు చాలామంది ఉన్నారు. కానీ, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో, తాజాగా జరిగిన గుజరాత్ ఎన్నికల్లో భాజపాకు ముస్లిం ఓటు బ్యాంకు పెరిగింది. దీన్ని మరింత పెంచుకోవాలీ, ముస్లింలకు మరింత చేరువ కావడానికి ఈ తలాక్ బిల్లు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ బిల్లు ద్వారా ముస్లిం మహిళలను బాగా ఆకర్షించవచ్చు. ఈ బిల్లు ఉద్దేశం కచ్చితంగా మంచిదే. కానీ, దీంతో రాజకీయ లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే సభను వేడెక్కిస్తున్నారు. కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్.. ఇలా అధికార పార్టీ వారూ ఈ సందర్భాన్ని కాంగ్రెస్ పై దుమ్మెత్తి పోసేందుకు వీలైనంత ఎక్కువగా వినియోగించుకుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు చేసిందేం లేదని చెప్పడంతోపాటు, ఇప్పుడు మేము ముస్లిం మహిళలకు మేలు చేయాలనుకుంటే అడ్డుపడుతున్నారంటూ భాజపా ప్రచారం చేసుకుంటోంది. కాంగ్రెస్ కు కీలక ఓటు బ్యాంక్ గా ఉంటున్న మైనారిటీల్లో చీలిక తేవాలంటే తలాక్ కంటే బలమైన అంశం మరొకటి లేదు. అందుకే, 2019 లోక్ సభ ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంకు లక్ష్యంగా ఈ బిల్లుపై పెద్ద చర్చకు భాజపా ఆస్కారం ఇస్తోందని చెప్పొచ్చు. అయితే, కాంగ్రెస్ ఈ బిల్లులో చేయమంటున్న మార్పు ఒక్కటే… మూడేళ్ల జైలు శిక్ష నిబంధనను కొంత సవరిస్తే తామూ మద్దతు ఇస్తామనే అంటోంది. మహిళలకు మేలు జరిగితే తాము వ్యతిరేకం కాదంటూనే, రాజ్యసభకు తలాక్ బిల్లు వచ్చేసరికి తమ పంతం నెగ్గించుకునేందుకు కాంగ్రెస్ కూడా కొంత పట్టుదలతోనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ బిల్లుపై చర్చ మరింత వాడీవేడిగా జరిగే అవకాశమే కనిపిస్తోంది.