కొన్ని నెలల కిందటి మాట ఇది! నంద్యాల నియోజక వర్గంలో ఉప ఎన్నిక జరిగింది. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి భారీ ఎత్తున ప్రచారానికి దిగారు. ఎంతగా అంటే… చంద్రబాబు ఓటమి నంద్యాల నుంచి మొదలౌతుంది అన్నారు. మహా కురుక్షేత్ర సంగ్రామానికి నంద్యాల నాంది పలుకుతుంది అన్నారు. తెలుగుదేశం పార్టీ ఓటమి అక్కడి నుంచే మొదలౌతుందనే సింగిల్ పాయింట్ అజెండాతోనే ప్రచారం చేశారు. కానీ, చివరికేం జరిగింది.. అనూహ్య మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలిచింది.
ఇక, ఇప్పటి విషయానికొస్తే… జగన్ సాగిస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర 52వ రోజుకు చేరుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పంలో జగన్ మాట్లాడారు. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజక వర్గం నుంచే వైకాపా గెలుపు మొదలుకావాలని అన్నారు. రిటైర్డ్ ఐ.ఎ.ఎస్. అధికారి చంద్రమౌళిని గెలిపిస్తే… మంత్రి పదవి ఇచ్చి తన పక్కనే కూర్చోబెట్టుకుంటానని జగన్ ప్రజలకు చెప్పారు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలి అంటూ పిలుపునిచ్చారు. కుప్పం నియోజక వర్గంలో చంద్రబాబు చేసినదానికంటే ఎక్కువ చేస్తానన్నారు. కుప్పం నియోజక వర్గంలో మరోసారి బస్సు యాత్ర ద్వారా వచ్చి, అన్ని మండలాల ప్రజలనూ కలుసుకుంటానని జగన్ అన్నారు.
మొన్న నంద్యాలతో నాంది అన్నారు. ఇప్పుడేమో కుప్పంతో మొదలు అంటున్నారు! కుప్పంతో ఎలా మొదలు అనేదే మొదటి ప్రశ్న..? ఎందుకంటే, ఇక్కడేమీ ఉప ఎన్నికల్లాంటివి జరగడం లేదు కదా. సార్వత్రిక ఎన్నికల్లో అన్ని నియోజక వర్గాలతో కలిపే కుప్పం ఎన్నిక ఉంటుంది. అలాంటిది, అదే మొదలు అని ఎలా చెప్పగలం..? సరే, పొలిటికల్ హీట్ పెంచడం కోసమే కుప్పంలో జగన్ ఇలా మాట్లాడారనే అనుకోవచ్చు. వాస్తవంగా మాట్లాడుకుంటే… చంద్రబాబుకు కుప్పం కంచుకోట. ముఖ్యమంత్రి సొంత నియోజక వర్గం. అలాంటి చోట జగన్ ఇచ్చిన హామీలు ఎలా ఉన్నాయంటే… వైకాపా అభ్యర్థిని గెలిపిస్తే మంత్రిని చేస్తానన్నారు! కుప్పం ప్రజలు ఓట్లేసి గెలిపించిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారాయె. ఇంకా మంత్రి పదవి ఏంటీ..? కాబట్టి, కుప్పంలో ఈ ప్రస్థావన రానీయకుండా ఉండాల్సింది. మరో పాయింట్ కి వస్తే… చంద్రబాబుకు మించిన అభివృద్ధి చేస్తానని జగన్ కుప్పం ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ ‘మించిన’ అంటే ఏంటి..? చంద్రబాబు నిర్లక్ష్యం చేసిన ఒకట్రెండు అంశాలనైనా ప్రస్థావించాలి కదా! జగన్ స్పీచ్ లో అదీ లేదు.
నంద్యాలలో టీడీపీ ఓటమికి నాంది అని అప్పుడు అన్నారు. ఇప్పుడు కుప్పంతో మొదలు కావాలని అంటున్నారు. వైకాపాకి అసాధ్యమని చెప్పడం ఇక్కడి ఉద్దేశం కాదు. దాన్ని సుసాధ్యం చేసే మార్గాలేవీ, అంతటి వ్యూహమేదీ అనేది కనీసం వైకాపా కార్యకర్తలకైనా తెలియాలి కదా! ఎంతైనా ముఖ్యమంత్రి స్వస్థానం అది. అక్కడే ఇలాంటి సవాల్ చేశారంటే.. దాని వెనక ఇప్పటికే కొంత గ్రౌండ్ వర్క్ చేసి ఉండాలి కదా. జగన్ చెప్పినంత ఈజీగా కుప్పంలో వైకాపా గెలుస్తుందని ఎంతమంది అనుకుంటారు..? అంతెందుకు, కనీసం వైకాపా వర్గాల్లో ఎంతమంది నూటికి నూరుశాతం దీన్ని నమ్ముతారు..? చంద్రబాబును ఓడించండి అని ప్రజలను కోరడం వరకూ ఓకే.. అంతేగానీ, కుప్పం నుంచే మన గెలుపు మొదలు అని జగన్ చెప్పడం ఎంతవరకూ ఆచరణ సాధ్యమనేది ఆ పార్టీ వర్గాలకు స్పష్టత ఉంటే ఎవరు మాత్రం కాదంటారు చెప్పండీ..!