నటుడు కమల్ హసన్ ఆర్కె నగర్ ఉప ఎన్నిక లో గెలిచిన దినకరన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఆర్కె నగర్ ఉప ఎన్నిక పెద్ద స్కామ్ అని, డబ్బు ఖర్చు చేసి దినకరన్ గెలిచాడని, జయలలిత మరణానంతరం నిర్వహించిన ఈ ఉపఎన్నిక భారతీయ ప్రజాస్వామ్యానికే మచ్చ అని కమల్ హసన్ ఒక వ్యాసంలో ఆరోపించారు. దీనిపై దినకరన్ స్పందిస్తూ కమల్ హసన్ తనపై కాదని,ఓటర్లపై దాడి చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. ఆర్.కె.నగర ప్రజల నిర్ణయాన్ని శంకించడానికి ఆయన దేవుడు కాదని దినకరన్ బదులు చెప్పారు.
అయితే దినకరన్ గెలుపు పై 3 రకాల విశ్లేషణలు వస్తున్నాయి
-
1. దినకరన్ విపరీతంగా దబ్బు ఖర్చు పెట్టడం వల్లే గెలిచాడని.
2. బిజెపి కి పన్నీర్ సెల్వం, పళని లూ మోకరిల్లడం తో పాటు, డిఎంకె నేతలు కూడా బిజెపి అండదండలతో 2జీ కేసులో నుంచి బయటపడ్డారనే భావనతో ప్రజలు బిజెపి మీద వ్యతిరేకతని వీళిద్దరి మీదా చూపడం వల్లే దినకరన్ గెలిచాడని.
3. స్టాలిన్ వ్యూహాత్మకంగా దినకరన్ ని గెలిపించాడని. ఎందుకంటే, పళని-పన్నీర్ ల పార్టీ గెలిస్తే ఇక తిరుగుబాటు ఎమ్మెల్ల్యేలు తగ్గుముఖం పట్టి దినకరన్ ని లైట్ తీసుకుంటారు. ఒకవేళ డిఎంకె గెలిస్తే, అన్నా డిఎంకె లో అంతర్మధనం జరిగి రెండువర్గాలూ కలిసిపోవచ్చు. ఒకవేళ కలవకపోయినా ఎమ్మెల్యేల జంపింగులు ఆగిపోవచ్చు. అదే దినకరన్ గెలిస్తే ఆయన మరికొంత మంది ఎమ్మెల్యేలని లాగడమూ, ప్రభుత్వాన్ని అస్థిరపరచడమూ జరిగి ఎన్నికలొచ్చే అవకాశముంది.
ఏది నిజమో చెప్పలేనంతగా ఈ మూడింటిలోనూ ఎంతో కొంత నిజముంది. కానీ ప్రజాస్వామ్యం లో ఎన్నికల ఫలితాలే గీటురాళ్ళు. నిరూపణ కానంత వరకు, ప్రతి విజయమూ, ప్రజల “నిష్పాక్షిక” తీర్పు కారణంగా ఒరిగిన విజయమే!