నిర్మాతలకు ఓ శుభవార్త. త్వరలో టికెట్ రేట్లు పెరగనున్నాయి. పెరిగిన రేట్లు సంక్రాంతి నుంచి అమలయ్యే అవకాశం ఉంది. టికెట్ రేట్లు పెంచమని గత కొంతకాలంగా నిర్మాతలు, పంపిణీదారులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. వాళ్లు ఇప్పుడు న్యాయస్థానాన్నీ ఆశ్రయించారు. వాద ప్రతివాదనలు విన్న తరవాత హైకోర్టు టికెట్ రేట్లు పెంచుకోమని ఆదేశించింది. దీనిపై అభ్యంతరాలు తెలియజెప్పడానికి ఫిబ్రవరి1 వతేదీ వరకూ గడువు ఇచ్చింది. ఎలాగూ సంక్రాంతి సీజన్ జనవరి తో ముగుస్తుంది. కాబట్టి.. ఈలోగా రాబోయే సినిమాలకు ఈ టికెట్ రేట్ల పెంపు ఓ వరం అనుకోవొచ్చు. అజ్ఞాతవాసి, జైసింహా సినిమాల వసూళ్లపై టికెట్ రేట్ల పెంపు అనుకూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశం కనిపిస్తోంది. బీసీ సెంటర్లలో బాల్కనీ 80 నుంచి 100 రూపాయల వరకూ ఉంది. మల్టీప్లెక్స్‌లో 150 రూపాయలు అమలు అవుతోంది. ఈ రేట్లు ఏమేరకు పెరుగుతాయో చూడాలి. వీటిపై ఒకట్రెండు రోజుల్లో తెలుగు చలన చిత్రసీమ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.