గత సంక్రాంతికి శర్వనంద్ ఎలాగో.. ఈ పండక్కి రాజ్ తరుణ్ అలా.
ఎందుకంటే 2017లో శర్వా అటు బాలయ్యతోనూ, ఇటు చిరంజీవితోనూ పోటీ పడ్డాడు.
ఇప్పుడు రాజ్ తరుణ్ కూడా అంతే. ఇటు పవన్‌తో, అటు బాలయ్యతో ఢీ కొట్టబోతున్నాడు. తను కథానాయకుడిగా నటించిన ‘రంగుల రాట్నం’ సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సందర్భంగా రాజ్ తరుణ్‌తో చిట్ చాట్
* ఏంటీ సడన్ సర్ప్రైజ్.. ఎలాంటి హడావుడీ లేకుండా రంగుల రాట్నం విడుదల చేసేస్తున్నారు?
– (నవ్వుతూ) సినిమా అంతా పూర్తయ్యాకే ప్రమోషన్లు మొదలెట్టాలని ముందే అనుకున్నాం. పోస్టర్ విడుదల చేసి, వెంటనే ట్రైలర్ కూడా చూపించేశాం. మీరు షాక్ అవ్వాలన్న ఉద్దేశంతోనే అలా చేశాం. టైటిల్, ట్రైలర్ ఒక్కసారిగా జనంలోకి వెళ్లిపోయాయి.. మేమంతా హ్యాపీ.
* సంక్రాంతి బరిలో దిగారు. పెద్ద సినిమాల పోటీతో తట్టుకోగలరా?
– పోటీ అనేది ఎప్పుడూ ఉండేది. ప్రతీవారం రెండు మూడు సినిమాలతో పోటీ పడాల్సివుంటుంది. సంక్రాంతికి పెద్ద సినిమాలు వస్తాయన్న సంగతి కూడా ముందే తెలుసు. కానీ ప్రతి సంక్రాంతికీ ఎక్కువ సినిమాలు విడుదల అవ్వడం.. బాగుంటే అన్నీ ఆడడం చూస్తూనే ఉన్నాం. రెండు గంటల పాటు థియేటర్‌కి వెళ్లి హాయిగా నవ్వుకుని వచ్చేలా ఈ సినిమా ఉంటుంది. అందుకే.. పండగ బరిలో దించాం. ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాలన్నీ బాగా ఆడాలి. అందులో మా సినిమా కూడా ఉండాలి. అయితే ఒక్క విషయం చెబుతా.. నేను పవన్, బాలయ్యలకు పోటీ కాదు.
* రంగులరాట్నం… టైటిల్ ఎలా పుట్టింది?
– టైటిల్ అనుకొని సెట్‌కి వెళ్లడం ఓ పద్దతి. మేం మాత్రం.. `మన పని మనం చేసుకుంటూ వెళ్దాం… ఈ కథే తన టైటిల్‌ని వెదుక్కుంటుంది` అనుకున్నాం. సినిమా పూర్తయ్యేసమయానికి `రంగుల రాట్నం` అయితే ఎలా ఉంటుంది?? అనుకున్నాం. అందరూ కూర్చుని ఇదే బాగుందని ఫిక్సయ్యాం.
* ఈ సినిమా ఎలా ఉండబోతోంది?
– సంక్రాంతికి ఎలాంటి సినిమా చూడాలనుకుంటారో అలాంటి సినిమానే ఇది. యువతరానికే కాదు, పెద్దలకూ నచ్చుతుంది. ఓ అందమైన ప్రేమకథతో పాటు మదర్ సెంటిమెంట్, వినోదం కూడా బాగా వర్కవుట్ అయ్యాయి.
* మీ పాత్ర గురించి….
– పక్కింటి అబ్బాయి తరహా పాత్ర లాంటిదే. నా లుక్, గెటప్ డిఫరెంట్‌గా ఉంటాయి. బేసిగ్గా ఓ మధ్యతరగతి అబ్బాయి. అల్లరి చిల్లరగా తిరిగే పాత్ర కాదు. ప్రతీ విషయంలోనూ సెలక్టీవ్‌గా ఉంటాడు. తనకు ఎదురైన అమ్మాయి ఎలాంటిది? ఆ అమ్మాయి లవ్ కండీషన్ల వల్ల తను ఎలా ఇబ్బంది పడ్డాడు? అనేదే కథ.
* పోస్టర్లు చూస్తుంటే.. .డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తున్నట్టుంది. ఈమధ్య జరిగిన ఓ యాంకర్ వ్యవహారం క్యాష్ చేసుకొందామనుకుంటున్నారా?
– అలాంటిదేం లేదండీ. ఈ పోస్టర్లు నెల రోజుల క్రితం డిజైన్ చేశారు. ఫొటో షూట్ చేసి కూడా చాలా కాలం అయ్యింది. ఎవరినో క్యాష్ చేసుకోవాలన్న ఉద్దేశం మాకు లేదు. అది తప్పు కూడా.
* ఈ సినిమా నాగార్జునగారు చూశారా?
– చూసే ఉంటారు.. ఆ సంగతి నాకు తెలీదు
* ఉయ్యాల జంపాలా తరవాత ఆ జోనర్ సినిమా ఏం చేయలేదు. `రంగులరాట్నం` ఆలోటు తీరుస్తుందా?
– ఈ జోనర్ తరవాత.. ఈ జోనర్ చేయాలి.. అన్ని జోనర్లూ టచ్ చేయాలన్న ప్లాన్స్ నాకేం ఉండవు. కథ నచ్చితే చాలు. అదే జోనర్ సినిమా అనేది ఆలోచించను. `రంగుల రాట్నం`లో ఓ మంచి కథ కనిపించింది. వెంటనే ఓకే చెప్పా.
* ఈ సినిమాలోనూ ఓ పాట రాశారు.. గీత రచయితగా మారాలన్న ఉద్దేశం కూడా ఉందా?
– అదేం లేదు. ఇది వరకు ఓ పాట రాశా. అది సరదాగా రాసిందే. ఇదీ అంతే. ఈ ట్యూన్‌ని దాదాపుగా రెండొందల సార్లు విని ఉంటా. ఆ మూడ్‌లో నాకు తోచిందేదో రాశా. ఈ పాట పెట్టుకుంటారని కూడా నాకు తెలీదు. గీత రచయిత కావాలంటే చాలా జ్ఞానం కావాలి. అంత సీన్ నాకు లేదు.
* 2018 ప్లాన్స్ ఏంటి.
– ఈ యేడాది రంగుల రాట్నంతో ప్రారంభం అవుతోంది. మరో మూడు సినిమాలు విడుదల చేయాలని భావిస్తున్నా. ఇప్పటికే నా చేతిలో నాలుగు సినిమాలున్నాయి. కొత్త కథలూ వస్తున్నాయి. 2018 అద్భుతంగా ఉండాలని, ఉంటుందని భావిస్తున్నా.