విజయవాడలోని కనకదుర్గమ్మ దేవాలయంలో జరిగిన తాంత్రిక పూజలపై భారీ ఎత్తున చర్చోపచర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అధికార ప్రతిపక్షాల మధ్య ఆరోపణలూ, మీడియాలో స్వామీజీల చర్చలూ, ఇంకోపక్క మంత్రి మాణిక్యాలరావు స్పందన, ఈవో సూర్యకుమారి తీరుపై పాలక మండలి సభ్యులే విమర్శలు చేయడం… ఇలా కొన్ని రోజులుగా ఇదే వ్యవహారం హాట్ టాపిక్ గా ఉంది. చివరికి, ఈ విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది! ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు ఫోన్ చేసి.. ఈ అంశాన్ని వీలైనంత తొందరగా ముగించేలా చూడమంటూ చెప్పినట్టు కథనాలు వచ్చారు. పాలక మండలి సభ్యులను కాస్త అదుపులో పెట్టమంటూ బుద్ధా వెంకన్నకు ముఖ్యమంత్రి చెప్పారట!
అయితే, ఇక్కడి నుంచే ఇంకో చర్చ టీడీపీ వర్గాల్లో మొదలు కావడం విశేషం! జిల్లాలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా స్థానిక సీనియర్ నేత, మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు స్పందించాలి కదా! కానీ, దుర్గ గుడిలో జరిగిన పూజలపై ఇంత వివాదం, ఇంత చర్చ జరుగుతున్నా ఆయన ఎందుకు స్పందించడం లేదన్నదే ఇప్పుడు టీడీపీలో సైతం చర్చనీయాంశం అవుతోందని తెలుస్తోంది. ఓపక్క జన్మభూమి కార్యక్రమంలో ఉంటున్న ముఖ్యమంత్రి కూడా… ఈ వివాదం తెరమీదకి రాగానే మంత్రి దేవినేనికి బదులుగా ఎమ్మెల్సీ వెంకన్నకు ఫోన్ చేయడంపై కూడా చర్చ జరుగుతోంది. నిజానికి, జిల్లా వ్యవహారాల గురించి మంత్రి దేవినేని ఈ మధ్య పట్టించుకోవడం లేదనీ, జిల్లా నాయకుల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించే ప్రయత్నం కూడా చేయలేదనీ అంటున్నారు.
కేవలం తనకు అప్పగించిన శాఖ, తన సొంత నియోజక వర్గానికి మాత్రమే ఆయన పరిమితం అవుతున్నారనే వ్యాఖ్య ఆ పార్టీ వర్గాల నుంచే వినిపిస్తోంది. ఈ విషయం ముఖ్యమంత్రికి కూడా తెలుసనీ, అందుకే ఈ అంశం తెరమీదికి రాగానే దేవినేనికి ఫోన్ చేయకుండా, వెంకన్నకు ఫోన్ చేశారనే గుసగుసలు రాజధాని టీడీపీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఇంకోపక్క ఆయన వైకాపా అధినేత జగన్ పై విమర్శలు చేయడంలో బిజీబిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. నీటి పారుదల శాఖ ప్రాజెక్టుల విషయమై జగన్ చేసిన విమర్శలకు దేవినేని కౌంటర్లు ఇస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుతోపాటు, రాష్ట్రంలోని కీలకమైన ఇతర ప్రాజెక్టుల అంశమై మంత్రి చాలా బిజీగా ఉండటం వల్లనే దుర్గ గుడి పూజల వివాదంపై ఆయన కలుగజేసుకోలేదనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే… గడచిన కొన్నాళ్లుగా ఆయన జిల్లా వ్యవహారాలు పట్టించుకోవడం లేదన్న చర్చ టీడీపీలో ఎందుకు జరుగుతోందన్న ప్రశ్న కూడా మిగిలే ఉంటుంది! టీడీపీలో మంత్రి దేవినేని మీద వినిపిస్తున్న ఈ కథనాలపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.