తెలుగుదేశం విషయంలో భాజపా స్పష్టమైన వైఖరి ఏంటీ.. గత కొన్నాళ్లుగా ఊగిసలాడుతున్న అంశం ఇది! కొన్ని అంశాల్లో భాజపా స్పందన చూస్తుంటే.. టీడీపీని దూరం పెడుతున్నట్టు కనిపిస్తుంది. మరికొన్ని విషయాల్లో తెలుగుదేశం పార్టీ వైఖరి గమనిస్తుంటే… భాజపాపై ఆధారపడాల్సిన పరిస్థితి తప్పదనే అనిపిస్తుంది. ఎన్నికలు వచ్చేసరికి ఈ రెండు పార్టీలూ కలిసి ముందుకు సాగుతాయా అనే సందిగ్ధం కూడా ఉంది. అయితే, ఈ అంశాలను ప్రభావితం చేసే స్థాయిలో కొన్ని పరిణామాలు ఢిల్లీలో చోటు చేసుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.
ఆంధ్రప్రదేశ్ కు చెందిన భాజపా, టీడీపీ ఎంపీలు కలిసికట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు, రెవెన్యూ లోటు, రైల్వే జోన్, కడప ఉక్కు కర్మాగారం వంటి కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. విభజన చట్టంలో పొందుపరచిన హామీలను అమలు చేయాలంటూ కోరారు. వీటిపై ప్రధాని అత్యంత సానుకూలంగా స్పందించారంటూ టీడీపీ నేత సుజనా చౌదరి మీడియాతో చెప్పారు. అంతేకాదు, ఈ అంశాలను ముఖ్యమంత్రితో చర్చిస్తాననీ, చంద్రబాబుతో వచ్చేవారం భేటీకి ఏర్పాటు చేస్తానని కూడా మోడీ హామీ ఇచ్చినట్టు సుజనా వివరించారు. ‘నా మనసులో ఆంధ్రప్రదేశ్ ఉందనీ, రాష్ట్రం కోసం నేనున్నాన’ని కూడా ప్రధాని భరోసా ఇవ్వడం ఈ సందర్భంగా ప్రత్యేకంగానే చూడాలి.
ఇది ఏపీ ప్రభుత్వానికి కొంత సానుకూలమైన సమాచారమే. ఎందుకంటే, చంద్రబాబుకి ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్న చర్చ చాన్నాళ్లుగా ఉంది. అంతేకాదు, ఏపీకి సంబంధించిన కీలక సమస్యలను కేవలం మంత్రుల స్థాయికే పరిమితం చేస్తున్నారనీ, స్వయంగా కలిసేందుకు మోడీ సమయం ఇవ్వడం లేదన్న పరిస్థితి కూడా ఈ మధ్య కనిపిస్తూ వస్తోంది. కానీ, ఇప్పుడు ఉన్నపళంగా ప్రధాని ఇలా స్పందించడం విశేషమే..!
ఇంకోపక్క.. ఇదే రోజున పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అభ్యంతరాలపై కూడా స్పష్టత రావడం! ప్రాజెక్టులోని కాపర్ డ్యామ్ పూర్తి చేసుకోవచ్చనీ, రాష్ట్రం అభీష్టం మేరకే దాని ఎత్తు నిర్ణయించుకోవచ్చనీ, కాంక్రీటు పనుల్ని పూర్తి చేసుకోవచ్చు అంటూ డ్యామ్ డిజైనింగ్ కమిటీ, కేంద్ర జలవనరుల శాఖ భేటీలో స్పష్టమైన ప్రకటన విడుదల చేయడం మరో విశేషం. అంతేకాదు, ఇటీవల పోలవరం టెండర్ల విషయమై జలవనరుల శాఖ మాజీ కార్యదర్శి అమర్జీత్ సింగ్ ఇచ్చిన ఆదేశాలను కూడా దాదాపు కొట్టేసినట్టే..! పిలిచిన టెండర్లనే కొనసాగించుకోవచ్చని అంగీకారం తెలపడం కూడా సానుకూలమైన అంశమే అనొచ్చు.
దీంతో ఇన్నాళ్లూ జరుగుతున్న చర్చలకు, వినిపిస్తున్న విశ్లేషణలకు కొంత తెర పడ్డట్టే అని చెప్పుకోవచ్చు. టీడీపీ, భాజపాల మధ్య ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న పరిణామాలన్నింటికీ ఒకేసారి చెక్ చెప్పాలన్న ఉద్దేశంతో ప్రధాని ఉన్నట్టున్నారు. అందుకే, ఒకే రోజున ఒకవైపు పోలవరంపై అడ్డంకులన్నింటిపైనా స్పష్టత రావడం, ఇంకోపక్క విభజన హామీల విషయమై చంద్రబాబుతో భేటీ అయి మాట్లాడతానని ఆయనే స్వయంగా ఏపీ ఎంపీలకు చెప్పడం జరిగినట్టు చూడొచ్చు. మొత్తానికి, కేంద్రం వైఖరి కొంత మారినట్టే అనిపిస్తోంది. అయితే, గతంలో కూడా ఇలానే జరిగిన సందర్భాలున్నాయి..! కొన్నాళ్లపాటు కేంద్ర, రాష్ట్రాల మధ్య కొంత సందిగ్ధత నెలకొనడం, చివరిగా కేంద్రం చొరవ ప్రదర్శించి కొంత సానుకూలంగా స్పందించేయడం.. దాంతో ఏపీకి కేంద్రం ఏదో మేలు చేసేస్తోందన్న వాతావరణం కనిపించడం జరిగింది. ఆ తరువాత, కొన్నాళ్లు గడిచాక సమస్యలు ఎక్కడివి అక్కడే ఉంటూ వచ్చాయి! అందుకే… చంద్రబాబుతో ప్రధాని భేటీ అయిన తరువాతే వాస్తవంలో ఏపీకి కేంద్రం ఇబ్బడిముబ్బడిగా చేయబోతున్న మేలేంటనేది మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు.