నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ‘డిక్టేటర్’ రిలీజ్ తర్వాత కొన్ని చోట్ల డివైడ్ టాక్ వచ్చినప్పటికీ, కొన్ని ఏరియాల్లో మాత్రం ప్రేక్షకులు ఈ సినిమాని సూపర్‌హిట్‌గా డిసైడ్ చేశారు. బాలకృష్ణ కొత్తలుక్, కొత్త డైలాగ్స్, రిస్కీ ఫైట్స్ ఆడియన్స్ చేత చప్పట్లు కొట్టిస్తున్నాయి. ‘లెజెండ్’ తర్వాత బాలకృష్ణ, అతని అభిమానులు ఈ సినిమా విషయంలో చాలా హ్యాపీగా వున్నారు. ఇలాంటి హ్యాపీ అకేషన్లోనే తన 100వ సినిమాకి సంబంధించి కొన్ని విశేషాలను బాలకృష్ణ వెల్లడించారు. తన కెరీర్లో ఓ విభిన్న చిత్రంగా, నటుడుగా తనకు మంచి పేరు తెచ్చిన చిత్రంగా ‘ఆదిత్య 369’ నిలుస్తుంది. ఈ చిత్రానికి సీక్వెల్ చెయ్యాలని ఎప్పటినుంచో బాలకృష్ణ అనుకుంటున్నారు. ‘ఆదిత్య 369’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సింగీతం శ్రీనివాసరావుతోనే ఈ చిత్రానికి సీక్వెల్ ‘ఆదిత్య 999’ చిత్రాన్ని చేయబోతున్నారు బాలకృష్ణ. ఇప్పటివరకు బాలకృష్ణ 100వ చిత్రాన్ని బోయపాటి శ్రీను చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఆ అవకాశం సింగీతం శ్రీనివాసరావుకు దక్కే అవకాశం కనిపిస్తోంది.
‘ఆదిత్య 999’ చిత్రానికి సంబంధించి మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రం ద్వారానే బాలకృష్ణ తన కుమారుడు మోక్షజ్ఞని ఇంట్రడ్యూస్ చెయ్యాలని ఆలోచిస్తున్నాడట. ‘ఆదిత్య 999’ చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్ కూడా రెడీగా వుందట. ఈ చిత్రం ద్వారా మోక్షజ్ఞని పరిచయం చేసే విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వుందట. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు తెలియజేస్తారట. నిజంగానే మోక్షజ్ఞని ఈ సినిమా ద్వారా పరిచయం చేసేట్టు అయితే అతనే ఆ సినిమాకి హైలైట్ అవుతాడనడంలో డౌట్ లేదు.