ఇప్పుడు కాంగ్రెస్ వంతు..! పోలవరం ప్రాజెక్టు కట్టిస్తున్న ఘనత మాదే అంటూ టీడీపీ, కట్టించేందుకు నిధులిస్తున్న ఘనత మాదే అంటూ భాజపాలు ఈ మధ్య సిగపట్ల వరకూ వెళ్లాయి. మొత్తానికి, ఆ వ్యవహారం ఒక కొలీక్కి వచ్చి, కేంద్ర రాష్ట్రాలు ఒకే తాటిపై నడిచి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సంసిద్ధమౌతున్న సంగతి తెలిసిందే. పోలవరంపై కేంద్రం నుంచి వ్యక్తమైన అన్ని రకాల అభ్యంతరాలపై కూడా కొంత స్పష్టత వచ్చేసిందిప్పుడు. ఈ నేపథ్యంలో పోలవరంపై తమవంతు ఘనతను క్లెయిమ్ చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ బయలుదేరుతోంది. రేపట్నుంచీ మహా పాదయాత్రకు కాంగ్రెస్ నేతలు సిద్ధమౌతున్నారు. ఆదివారం నాడు ధవళేశ్వరం నుంచి ఈ పాదయాత్రను ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని జిల్లాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రాజెక్టు నిర్వాసితులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారని రాష్ట్ర నేతలు అంచనా వేసుకుంటున్నారు.
ధవళేశ్వరం వద్ద ప్రారంభం కాబోతున్న ఈ పాదయాత్ర కార్యక్రమానికి ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, పల్లంరాజు, కేవీపీ రామచంద్రరావుతో సహా కొంతమంది ముఖ్యనేతలు హాజరు కాబోతున్నారు. ఈ యాత్ర 10వ తేదీన పోలవరానికి చేరుతుంది. అక్కడ ఆరోజున సామూహిక దీక్షలు చేస్తారు. ఈ కార్యక్రమానికి లోక్ సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే వస్తున్నారు. దీని కోసం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో జన సమీకరణకు నేతలు ప్రయత్నిస్తున్నారు.
ఈ యాత్ర ద్వారా రాష్ట్రంలో పార్టీ ఉనికి బాగానే ఉందని చాటి చెప్పుకోవడం కాంగ్రెస్ నేతల ఉద్దేశం అనేది వేరే చెప్పనక్కర్లేదు. అంతేకాదు, పోలవరం ప్రాజెక్టుకు కాంగ్రెస్ హయాంలోనే శంకుస్థాపన జరిగిందనీ, దాదాపు రూ. 5,136 కోట్లను వారి హయాంలోనే ప్రాజెక్టు నిమిత్తం ఖర్చు చేశామని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోబోతున్నారు. కేంద్రంలోని భాజపా, ఆంధ్రాలోని టీడీపీ సర్కారులు గడచిన మూడున్నరేళ్లుగా పోలవరం ప్రాజెక్టుకు నిధులను సరిగా సమీకరించలేకపోతున్నాయని ప్రచారం చేయబోతున్నారు. అంతేకాదు, ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పోలవరం దగ్గర జరిగే సభ ద్వారా హెచ్చరించాలన్న ఉద్దేశంతో నాయకులు సిద్ధమౌతున్నారు.
అయితే, ఈ కార్యక్రమం ఎంతవరకూ విజయవంతం అవుతుందనేదే ఇప్పుడు చాలామందిలో నెలకొన్న సందేహం..? ఎందుకంటే, నిన్నటి వరకూ పోలవరంపై భాజపా, టీడీపీల మధ్య కొత్త వాడీవేడీ చర్చ ఉండేది. టెండర్ల విషయంలో కేంద్రం కొర్రీలు పెట్టడం, ప్రాజెక్టు నిర్మాణమంతా చంద్రబాబు నెత్తినేసుకుని తమకు ఘనత దక్కనీయకుండా చేస్తున్నారంటూ భాజాపా నేతలు విమర్శించడం.. ఇవన్నీ చూశాం. కానీ, శుక్రవారం నాడు ప్రధాని నరేంద్ర మోడీని ఏపీ భాజపా, టీడీపీ నేతలు సంయుక్తం కలుసుకోవడం… ఆయన సీఎం చంద్రబాబుతో మాట్లాడతానని చెప్పడం జరిగింది. ఇంకోపక్క పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పరిపూర్ణ సహకారం ఉంటుందంటూ కేంద్ర జలవనరుల శాఖ కూడా నిన్ననే కొన్ని క్లియరెన్స్ లు ఇచ్చేసింది. సో… ఆ వేడి అంతా చల్లారిపోయిన తరువాత, కాంగ్రెస్ పార్టీ మహా పాదయాత్రకు దిగడం ఎంతవరకూ సరైన వ్యూహం అవుతుందో చూడాలి మరి!