గాంధీభవన్ లో అడుగుపెట్టిన తొలిరోజునే మంత్రి కేటీఆర్ మామయ్యపై రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా దాదాపు ఇలాంటిదే మరో అంశంతో రేవంత్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి విద్యార్హతపై తాజాగా అన్ని ఆధారాలతో ఆరోపణలు చేశారు. గడచిన రెండు పర్యాయాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన దాఖలు చేసిన పత్రాల్లో కూడా విద్యార్హత విషయమై తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. అంతేకాదు, లక్ష్మారెడ్డి పొందిన బీహెచ్ ఎంసీ డిగ్రీ కూడా చెల్లదంటూ ఆధారాలతో ఆరోపించారు.
కర్ణాటక రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ప్రారంభించిన హైదరాబాద్ కర్ణాటక ఎడ్యుకేషన్ సొసైటీ యూనివర్శిటీలో లక్ష్మారెడ్డి చదువుకున్నారని రేవంత్ చెప్పారు. అయితే, 1980-81లో ప్రారంభించిన ఆ కళాశాలకు 1985 వరకూ సీసీహెచ్ అనుమతి రాలేదని అన్నారు. ఆ కళాశాలలోని మొదటి బ్యాచ్ విద్యార్థుల్లో లక్ష్మారెడ్డి ఉన్నారనీ, అయితే 1985 వరకూ అనుమతులు లేనప్పుడు… ఆ మధ్య కాలంలో ఆయన చదివిని చదువు చెల్లుతుందా అని రేవంత్ ప్రశ్నించారు. 2004 ఎన్నికల అఫిడవిట్ లో వారే స్వయంగా సంతకం చేశారనీ, తాను గుల్బర్గా యూనివర్శిటీ నుంచి బీహెచ్ ఎంసీ పూర్తి చేశాననీ, 1988లో ఉత్తీర్ణుడి అయ్యానని లక్ష్మారెడ్డి పేర్కొన్నారు అని రేవంత్ ఆ పత్రాలను చూపించారు. 2014 ఎన్నికల్లో మళ్లీ శాసన సభ్యుడిగా పోటీ చేసిన సందర్భంలో నేటి మంత్రి దాఖలు చేసిన విద్యార్హత వివరాలు మరోలా ఉన్నాయన్నారు. హైదరాబాద్ కర్ణాటక ఎడ్యుకేషనల్ సొసైటీ యూనివర్శిటీ నుంచి తాను 1987లో పాస్ అయ్యానని పేర్కొన్నట్టు ఆ పత్రాలను కూడా రేవంత్ చూపించారు. 2004లో ఒక యూనివర్శిటీ అనీ, 2014 ఎన్నికలకు వచ్చేసరికి మరో విశ్వవిద్యాలయం అని పేర్కొనడం ఎన్నికల సంఘాన్ని తప్పుతోవ పట్టించడమే అవుతుందనీ, ఇది శిక్షార్హమైన నేరమని అన్నారు. అంతేకాదు, ఓసారి 1988లో ఉత్తీర్ణుణ్ని అయ్యాననీ, మరోసారి 1987లో డిగ్రీ పొందానని చెప్పడంలో అర్థమేంటంటూ లక్ష్మారెడ్డిని నిలదీశారు.
తన విద్యార్హతకు సంబంధించిన ఈ వివరాలపై ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం మంత్రి లక్ష్మారెడ్డికి ఉందని డిమాండ్ చేశారు. గుల్బర్గా యూనివర్శిటీ నుంచి పాస్ అయ్యారా, లేదంటే.. హైదరాబాద్ కర్ణాటక యూనివర్శిటీ నుంచి పాసయ్యారా అనేది కూడా వివరణ ఇవ్వాలన్నారు. అయితే, తాను పక్కా ఆధారాలతో సరైన సమాచారంతో ఇలాంటి ఆరోపణలు చేస్తుంటే… మంత్రులు లక్ష్మారెడ్డి, కేటీఆర్ లు తనపై కొంతమందితో వ్యక్తిగత దూషణలు చేయిస్తున్నారని చెప్పారు. మానసికంగా తనను ప్రభావితం చేయాలని చూస్తున్నారన్నారు. తనపై ఏ రకమైన పదజాలం వాడి కొంతమంది దూషణలు చేస్తున్నారో, తన అనుచరులు అదేపని చేసి చూపిస్తారని, ఆ పరిస్థితి తెచ్చుకోవద్దంటూ మంత్రి లక్ష్మారెడ్డి, కేటీఆర్ లను రేవంత్ హెచ్చరించారు.
కేటీఆర్ మామయ్య కులధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన రేవంత్ చేసిన ఆరోపణలపై సరైన రిప్లై రాలేదు. ఇప్పుడు మంత్రి లక్ష్మారెడ్డి విషయంలో కూడా రేవంత్ బాగానే రీసెర్చ్ చేసి ఆధారాలను సేకరించి, బలమైన ఆరోపణలు చేశారు. తాజా అంశంపై లక్ష్మారెడ్డి ఎలా స్పందిస్తారో వేచిచూడాలి. కాంగ్రెస్ లో చేరిన తరువాత తెరాస సర్కారుపై రేవంత్ లేవనెత్తిన రెండో బలమైన అంశంగా దీన్ని చూడొచ్చు. మొత్తానికి, కాంగ్రెస్ లో చేరాక రేవంత్ బాగానే హోమ్ వర్క్ చేసుకుని మీడియా ముందుకు వస్తున్నారు.