ప్రముఖ నటి మరియు మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే జయసుధ నిన్న సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెదేపాలో చేరారు. ఆమె మొట్టమొదటిసారిగా తన భర్త నితిన్ కపూర్ ని తోడ్కొని రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మునిసిపల్ శాఖ మంత్రి పి. నారాయణ జయసుధ దంపతులను గుంటూరు జిల్లా ఉండవల్లిలో ముఖ్యమంత్రి నివాసానికి ముఖ్యమంత్రి వద్దకు తోడ్కొని వెళ్ళారు. చంద్రబాబు నాయుడు ఆమెకు పార్టీ కండువా కప్పి పార్టీలో చేర్చుకొన్నారు. జయసుధతో బాటు ఆమె భర్త కూడా ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్ళినప్పటికీ కేవలం ఆమె మాత్రమే తెదేపాలో చేరారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ “నేను 1999లో తెదేపా తరపున ఎన్నికలలో ప్రచారం చేసాను. మళ్ళీ ఇన్నేళ్ళకు తెదేపాలో చేరి పని చేసే అవకాశం దక్కింది. అవసరమయితే జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో ప్రచారం చేయడానికి నేను సిద్దం. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసినట్లుగానే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేస్తారని నేను నమ్ముతున్నాను. నేను ఏదో ఒక రాష్ట్రానికే పరిమితమవకుండా తెదేపా తరపున రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి సేవ చేయాలనుకొంటున్నాను,” అని చెప్పారు.
గతంలో జయసుధ సికిందరాబాద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయినప్పుడు తన నియోజకవర్గ ప్రజలతో మంచి సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకోగాలిగారు. కనుక ఒకవేళ ఆమె తెదేపా, బీజేపీల తరపున జి.హెచ్.ఎం.సి. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లయితే, అక్కడ స్థిరపడిన ఆంద్ర ప్రజల ఓట్లు ఆ రెండు పార్టీలకు పడే అవకాశం ఉంటుంది. జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకోదలచుకోలేదు కనుక ఆ పార్టీ తెలంగాణా అధ్యక్షుడు ఎల్.రమణ మరియు పార్టీ సీనియర్ నేతలు ఆమెను ఎన్నికల ప్రచారంలో పాల్గొనవలసినదిగా ఆహ్వానించినట్లయితే ఆమె కూడా సిద్దంగా ఉంది కనుక చంద్రబాబు నాయుడు అభ్యంతరం చెప్పకపోవచ్చును.