ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వైఖరిలో మార్పు వస్తోందా..? మారిన మోడీని మనం చూడబోతున్నామా..? ఎవర్నీ లెక్కచేయని విధంగా ఉండేట్టు కనిపించే తన ధోరణిని కొంత మార్చుకోబోతున్నారా..? మిత్రపక్షాలతో గతం కంటే మరింత స్నేహ బంధాన్ని పెంచుకోబోతున్నారా..? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం చెప్పుకోవచ్చు! భవిష్యత్తులో భాజపాకి తప్ప, ఇతర ప్రాంతీయ పార్టీలకు మనుగడ ఉండదనే రీతిలో మోడీ వ్యవహార శైలి ఉండేది. ఇతర పార్టీలన్నీ భాజపాపై ఆధారపడాల్సిన ఒక అనివార్యత దేశవ్యాప్తంగా తీసుకొచ్చేందుకు బాగానే ప్రయత్నించారు. వీలైతే తాము అధికారంలో ఉండేలా, లేదంటే తమ మద్దతుతో అధికారంలోకి వచ్చేలా కొన్ని రాష్ట్రాల్లో వ్యూహాలను అమలు చేసుకుంటూ వచ్చారు. కానీ, గుజరాత్ ఎన్నికల ఫలితం తరువాత ప్రధాని ధోరణి మార్చుకోవాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తోందనేది ఢిల్లీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఆ మార్పు ఆంధ్రాతోనే మొదలైందని చెప్పుకోవచ్చు!
ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీతో దాదాపు ఓ ఏడాదిగా అంటీముట్టనట్టుగానే ఉంటూ వచ్చారు. విభజన హామీల విషయంలో అదిగోఇదిగో అమలు అన్నారే తప్ప, వాస్తవంలో రాష్ట్రానికి రావాల్సినవి చాలానే ఉన్నాయి. ఇన్నాళ్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీకి సరేనన్నారు. ఈనెల 12న ప్రధానితో చంద్రబాబు భేటీ జరుగుతుంది. ఆ తరువాత, 2019 లోక్ సభ ఎన్నికల్లో టీడీపీతోనే పోత్తు కొనసాగుతుందని ప్రకటించే అవకాశం ఉంది. దీంతోపాటు విభజన చట్టంలో ఇచ్చిన హామీలపై కూడా కేంద్రం సాయం కచ్చితంగా కార్యరూపంలో కనిపిస్తుందనే అంచనాలు కూడా ఉన్నాయి. ఇకపై తమ సహజ మిత్ర పక్షాలను దూరం చేసుకోకూడదు అనే ధోరణి భాజపాలో మొదలైందనడానికి తాజా పరిస్థితిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
గుజరాత్ ఎన్నికలు ముగిసిన తరువాత ప్రధాని మోడీ కొన్ని అంతర్గత సర్వేలు చేయించుకున్నట్టు సమాచారం. వాటి ప్రకారం.. గ్రామీణ భారతంలో భాజపా హవా తగ్గుతోందని నిగ్గు తేలిందనే కథనాలు కూడా ఈ మధ్య వచ్చాయి. భాజపా వైఖరి కారణంగా శివసేన దూరంగా జరుగుతూ ఉండటం, ఏపీలో టీడీపీతో పొత్తు విషయమై రకరకాల కథనాలు రావడం, అకాలీదళ్ వంటి పార్టీలు కూడా భాజపాపై కొంత విముఖత వ్యక్తం చేయడానికి సిద్ధం కావడం… ఈ పరిస్థితుల నేపథ్యంలో భాజపా పెద్దలతో ఆర్.ఎస్.ఎస్. ప్రముఖులు ఓ అంతర్గత సమావేశం నిర్వహించారని సమాచారం. కాంగ్రెస్ తో కలిసే అవకాశం లేని పార్టీలను దూరం చేసుకూడదన్నది ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయంగా తెలుస్తోంది. ఇదే సమావేశంలో వైకాపా, తెరాసల ప్రస్థావన కూడా వచ్చినట్టు కథనం! ఆ రెండు పార్టీలూ కాంగ్రెస్ కు బద్ధ వ్యతిరేకులుగా ఉండే అవకాశాలు తక్కువనీ, అవసరాన్ని బట్టీ వారు మారిపోయే అవకాశం ఉందనే విశ్లేషణలు కూడా ఆ సమావేశంలోనే వ్యక్తమైనట్టు చెబుతున్నారు.
గుజరాత్ లో అతి కష్టమ్మీద అధికారం చేజారకుండా కాపాడుకున్నారు. గ్రామీణ భారతంలో ఉద్యమాలు పెరుగుతున్నాయి. ఇంకోపక్క, దళిత ఉద్యమాలు కూడా విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భాజపా వైఖరిలో కొంత మార్పు అనివార్యంగా కనిపిస్తోంది. దీన్ని భాజపా త్వరగానే గుర్తించిందని అనుకోవచ్చు. కాబట్టి, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మరోసారి అధికారం నిలబెట్టుకోవాలంటే ముందుగా తమ సహజ మిత్రపక్షాలను కాపాడుకునే దిశగా చర్యలు చేపట్టాలని మోడీ భావిస్తున్నారు. దీంతోపాటు, రాబోయే బడ్జెట్ లో గ్రామీణాభివృద్ధి అంశాలకు అధిక కేటాయింపులు దక్కేలా, మోడీ దగ్గరుండి మరీ బడ్జెట్ ప్రిపేర్ చేయించుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో… మోడీ వైఖరిలో కొంత స్పష్టమైన మార్పు కచ్చితంగా వస్తుందనే చెప్పొచ్చు.