బిఏ రాజు…
నిర్మాతల్లో దిల్రాజు స్టార్ అయితే.. పీ ఆర్వోలలో.. బిఏ రాజు స్టార్!
స్టారేంటి… ఆ మాట కొస్తే ఇంకొంచెం ఎక్కువే..!
హీరోలు. నిర్మాతలు, దర్శకులు వీళ్లందరి తల్లో నాలుక.. ఆయనే.
హీరో ఎవరైనా, బ్యానర్ ఏదైనా… పీఆర్వో రాజు అయితే.. మీడియా దృష్టిలో అది `రాజుగారి సినిమా` అయిపోతుంది. ఓ పీఆర్వోకి ఆ స్థాయి రావడం, తన ముద్ర వేయగలిగేలా చూసుకోవడం కచ్చితంగా ఆయన సాధించుకున్న ఘనతే.
ఒకటా.. రెండా? వందా.. ఐదొందలా?? ఏకంగా పన్నెండొందల సినిమాలకు పీఆర్వో ఆయన. ఇప్పటి స్టార్ హీరోలంతా ఆయన ముందు ఎదిగిన వాళ్లే. వాళ్ల కెరీర్ ప్రతి మలుపులోనూ… రాజు ఉన్నారు. వాళ్లంతా తమ తమ నిర్మాతలకైనా గౌరవం ఇస్తారో లేదో గానీ… ఆ ప్రెస్ మీట్లో బీఏ రాజు కనిపిస్తే చాలు ‘ఏవండోయ్ రాజు గారూ..’ అంటూ పలకరింపులు మొదలెట్టేస్తారు. సదరు సినిమాకి ఆయన పీఆర్వో అయినా కాకపోయినా ఆ సినిమా యోగ క్షేమాలు అడిగి తెలుసుకుంటారు.
`ఆల్ ఈజ్ వెల్… అంతా బాగుంది..` అనుకోవడం ఆయన పాలసీ.
హిట్ సినిమాలోని లోటు పాట్లు విమర్శకుడు గమనిస్తాడు.
సద్విమర్శకుడు మాత్రం ఫ్లాప్ సినిమాలోనూ మంచి కనిపెడతాడు.
బిఏ రాజు రెండో రకం. సినిమా తాలుకు కష్టం, అందుకోసం పడే శ్రమ.. ఇవన్నీ రాజుకి తెలుసు. అందుకే ఏ సినిమానీ తక్కువ చేయడు. ‘ఆ సినిమా పోయిందట కదా’ అంటూ పరాచకాలు అడేవాళ్లకు చిన్న సైజు ‘జ్ఞానబోధ’ చేస్తుంటారు.
ఆ ఇష్టంతోనే నిర్మాత కూడా అయ్యారు. ఆయన అనుకుంటే. తన పలుకుబడిని ఉపయోగించి యేడాదికి ఒకటీ రెండు సినిమాలు చేసేసేవారు. కానీ తనకు నచ్చిన సినిమాల్ని, తన డబ్బుతో, తన కష్టంతో తెరకెక్కించి.. ఆ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు. వేస్తున్నారు. ఏదో ఓ రోజు నిర్మాతగానూ.. ఆయన ‘స్టార్’ అనిపించుకుంటారు. అదే ఆయన లక్ష్యం.. నమ్మకం! సినిమా తప్ప మరో ధ్యాసలేని.. రాజుగారికి… జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటోంది తెలుగు 360.కామ్