తాజాగా ఏఐసీసీ విడుదల చేసిన ఓ ప్రకటనపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేరిట విడుదలైన ఆ ప్రకటన సారాంశం ఏంటంటే… పీసీసీలూ, ఇతర కీలక కమిటీల పదవుల్లో ఇప్పట్లో మార్పులు ఉండవనేది. అయితే, దీంతో తెలుగు రాష్ట్రాల పీసీసీ అధ్యక్ష పదవుల్లో ఉన్నవారు కొనసాగుతారా, మార్పులు ఉండవా అనే చర్చ వినిపిస్తోంది. నిజానికి, ఇది తెలంగాణలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని కొనసాగిస్తున్నట్టుగానో, ఆంధ్రాలో రఘువీరా పదవి మార్పు ఉండదనో చెప్పడానికి చేసిన ప్రకటన కాదు. పీసీసీలతోపాటు ఇతర కమిటీల్లో సమూల మార్పులకు ఇది సరైన సమయం కాబట్టి, రాహుల్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచీ పార్టీలో పదవులు మార్పులు ఉంటాయనే చర్చకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ప్రకటన విడుదల చేసినట్టు చెప్పుకోవచ్చు. ‘పార్టీ కీలకమైన నిర్ణయాలు తీసుకునే వరకూ వీరే కొనసాగుతార’ని మాత్రమే ఆ ప్రకటనలో ఉంది.
రాహుల్ అధ్యక్షుడిగా పార్టీ బాధ్యతలు చేపట్టిన తరువాత కొత్త టీమ్ తయారు చేసుకోవాలి కదా. అంతేగానీ, ఉన్నవాళ్లనే కొనసాగిస్తూ పోతే కాంగ్రెస్ పార్టీకి యంగ్ లుక్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పిండి..? అలాంటప్పుడు ఈ తాజా ప్రకటన ఎందుకు విడుదల చేసినట్టు అంటే… ఇప్పటికిప్పుడు ఏవైనా మార్పులు అంటూ సీనియర్లను పక్కనపెడితే, వారు బయటకి వెళ్లి పార్టీపై విమర్శలు చేసే ఆస్కారం ఉంటుందనేది కాంగ్రెస్ అంతర్గత విశ్లేషణగా తెలుస్తోంది. గత లోక్ సభ ఎన్నికల్లో అతి తక్కువ స్థానాలను కాంగ్రెస్ దక్కించుకుంది. గడచిన మూడున్నరేళ్లలో కూడా కాంగ్రెస్ పార్టీ కొత్తగా శక్తి పుంజుకుందనే పరిస్థితి కనిపించలేదు. ఇప్పుడిప్పుడే పార్టీ కొంత కోలుకున్నట్టు, రాహుల్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తరువాత గుజరాత్ లో భాజపాకి గట్టి పోటీ ఇచ్చామన్న భావన కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. త్వరలోనే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి, ఇప్పటికిప్పుడు కీలక కమిటీల్లో మార్పులు అంటే అదో సమస్యగా మారుతుందేమో అనే అభిప్రాయం పార్టీలో అంతర్గతంగా వ్యక్తమైనట్టు సమాచారం.
అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచీ పార్టీ పదవుల్లో మార్పులూ చేర్పులూ ఉంటాయని వినిపిస్తూనే ఉంది. అయితే, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఈ అంశాన్ని వాయిదా వేయాలనేది రాహుల్ ఆలోచనగా తెలుస్తోంది. అక్కడ గెలిస్తే… వెంటనే మార్పులు మొదలుపెట్టేస్తారని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. లేకుంటే, కొంత విరామం తరువాత ఈ అంశంపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. అయితే, ఈలోగా పార్టీలో కొన్ని కొత్త పోస్టులు సృష్టించి, యువతకు ప్రాధాన్యత కల్పించడం మొదలుపెడతారనీ అంటున్నారు. ఈ మధ్యనే, పార్టీలో పనిచేసేవారికే ప్రాధాన్యత ఉంటుందని నేతలకు రాహుల్ క్లాస్ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఉన్నపళంగా సమూల మార్పులకు శ్రీకారం చుడితే ఇబ్బంది తప్పదేమో అనే సందిగ్దంలో ఉన్నట్టూ సమాచారం.