అజ్ఞాతవాసిలో వెంకటేష్ కనిపించబోతున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని చిత్రబృందం కూడా ప్రకటించింది. దాంతో వెంకీ పాత్ర ఏమిటి? ఎంతసేపు ఉంటాడన్న ఆసక్తి మొదలైంది. ఈ కథలో వెంకీ పాత్రకు ఎంతో కొంత ప్రధాన్యం ఉండడం తథ్యమని చెప్పుకున్నారు. అయితే.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… ఈ సినిమా కథకీ, వెంకీ పాత్రకూ ఏమాత్రం సంబంధం లేదట. ఆయన అలా వచ్చి… ఇలా వెళ్లిపోయే పాత్ర మాత్రమేనని ఒకే ఒక్క సీన్లో కనిపిస్తారని సమాచారం. అయితే వెంకీ పాత్రని ఇప్పుడు చూపిస్తారా, లేదా? అనే సందేహాలు నెలకొన్నాయి. అజ్ఞాతవాసిలో వెంకీ ఉన్నా, లేకున్నా వసూళ్లలో పెద్దగా మార్పు ఉండదు. కాబట్టి… వెంకీ లేకుండానే సినిమా విడుదల చేసి, కొన్ని రోజుల తరవాత వెంకటేష్ పాత్రని కలిపితే ఎలా ఉంటుది? అనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. అప్పుడు వెంకీని చూడ్డానికైనా… రిపీటెడ్ ఆడియన్స్ వస్తారన్నది వాళ్ల నమ్మకం. వెంకీ సీన్ మాత్రమే కాదు.. అదనంగా మరో రెండు సన్నివేశాల్ని కూడా సెన్సార్ చేసి ఉంచుకున్నారని, సినిమా స్థాయిని బట్టి ఆ సన్నివేశాలు కలపాలా, వద్దా అనే నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. సో.. వసూళ్లు పెంచుకోవడానికి ఇదో మార్గమన్నమాట.