ప్రశ్నిస్తా అన్న పవన్ కల్యాణ్ ఎన్ని ప్రశ్నలు సంధించాడో తెలీదు గానీ, కత్తి మహేష్ మాత్రం చాలా చాలా ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు. అందులో అర్థమైనవి కొన్ని. అర్థం లేనివి కొన్ని. అర్థం పర్థం కానివి మరికొన్ని. పవన్‌ని టార్గెట్ చేసుకొని సెలబ్రెటీ అయిపోయిన వాళ్ల జాబితాలో కచ్చితంగా కత్తి మహేష్ మొదటి స్థానంలోనే ఉంటాడు. `ఏం ధైర్యంగా అడుగుతున్నాడ్రా` అని మొదట్లో మురిసిపోయిన వాళ్లు కూడా కత్తి మహేష్‌ది కేవలం మీడియా అటెన్షన్ కోసం చేస్తున్న ప్రయత్నమన్నది క్రమక్రమంగా అర్థమవుతోంది. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్ మీడియా సమావేశంలో మహేష్ కత్తి అవలంభించిన తీరు కాస్త ఆశ్చర్యంగానూ, ఇంకాస్త అయోమయంగానూ కనిపిస్తోంది. ఆదివారం అంతా.. ఏ ఛానల్ చూసినా అతని పేరే. ఆ మేరకు అటెన్షన్ అయితే తెచ్చుకోగలిగాడు గానీ.. చివరికి కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఓ లైవ్ షో లోంచి అర్థాంతరంగా లేచి వెళ్లిపోయాడు. బహుశా.. ప్రశ్నించే కత్తి మహేష్.. సమాధానం లేక చేష్టలూడిపోయిన సందర్భం ఇదేనేమో.
పవన్ రాజకీయాల గురించి ఎవరైనా మాట్లాడొచ్చు. అది అందరి హక్కు. కానీ వ్యక్తిగత దూషణ మాత్రం ఎంతమేర సమంజసం అనేది కత్తి మహేష్ లాంటి వాళ్లు గమనించాలి. పవన్‌ని టార్గెట్ చేసిన కత్తి.. మధ్యలో పూనమ్ కౌర్, త్రివిక్రమ్‌లను ఎందుకు లాగినట్టు. పూనమ్ కౌర్ అభిమానులు, త్రివిక్రమ్ అభిమానులు కత్తి మహేష్‌పై సామాజిక, నైతిక దాడులేం చేయలేదు కదా?? క్షుద్రపూజలు, ఆసుపత్రి వ్యవహారాలకూ… రాజకీయాలకూ ఏమైనా సంబంధం ఉందా?? అంటే… ఇక్కడ కత్తి మహేష్ లక్ష్యం ఒక్కటే.. ఎలాగైనా సరే – పవన్‌ని ఇరుకున పెట్టాలి.
సరే… పవన్‌పై ఆయన సంధిస్తున్న ప్రశ్నలన్నీ సహేతుకమైనవే అనుకుందాం. దానికి పవన్ ఎందుకు సమాధానం చెప్పాలి..?? కత్తి మహేష్‌లా `ఇగ్నోర్` చేసే అధికారం, అవకాశం ఆయనకు లేదా?? మీడియా సమావేశంలో కత్తి మహేష్‌కు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. దానికి కత్తి సమాధానాలేం చెప్పలేదు. `మీకు ఇష్టం లేకపోతే మీరు నన్ను ఇగ్నోర్ చేయొచ్చు` అని సింపుల్‌గా తేల్చేశాడు. మరి పవన్‌కి ఆ అవకాశం లేదా?? కత్తి మహేష్ లాంటి వాడు ప్రెస్ మీట్ పెడితే.. పవన్ రావాల్సిన అవసరం ఉందా?
రేపొద్దుట.. కత్తి మహేష్‌ని విమర్శిస్తూ.. ఏ అమలాపురంలోనో, ఆత్రేయ పురంలోనే ఎవడో ఒకడు ప్రెస్ మీట్ పెడతాడు. దానికి కత్తి మహేష్ హాజరు అవుతాడా??? `మహా టీవీ` లైవ్ షోలోంచి కత్తి మహేష్ పరారవ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తుర్రుమన్నాడని… తెలుస్తూనే ఉంది. అంటే… ప్రశ్నలు వేయడానికేనా?? తనవైపుకు బాణంలా దూసుకొస్తే భయపడి పారిపోతాడా?? కత్తి మహేష్ జీవితంలోనూ ఎన్నో అనుకోని పార్వ్శాలున్నాయని, ఆయన కూడా దాచి వేసే ప్రశ్నలు, సమాధానాలు ఇవ్వలేని అంశాలు చాలా ఉన్నాయని తెలుస్తూనే ఉంది. రేపటి నుంచి ఎవరో ఒకరు ఏదో ఓ విషయంపై కత్తి మహేష్‌ని ప్రశ్నిస్తూనే ఉంటారు. వాటన్నిటికీ కత్తి మహేష్ సమాధానాలు చెప్పక తప్పదు. లేదంటే.. ఆయన ప్రశ్నించే అవకాశాన్ని కోల్పోతాడు.