హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు చేదు అనుభవం ఎదురయింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక డివిజన్ టికెట్ కోసం ఆయన టీడీపీ గ్రేటర్ అధ్యక్షుడికి ఫోన్ చేయగా, ఆయన ఆ సిఫార్సును తిరస్కరించారు. దాని పూర్వాపరాలిలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తన మనిషి సుభాష్ రెడ్డికి జూబ్లీహిల్స్ డివిజన్ టీడీపీ టికెట్ ఇవ్వాల్సిందిగా టీడీపీ గ్రేటర్ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్‌కు నిన్న ఫోన్ చేశారు. అయితే జూబ్లీహిల్స్ డివిజన్‌ను సర్దుబాటులో భాగంగా బీజేపీకి కేటాయించినట్లు గోపీనాథ్ పవన్‌కు చెప్పారు. దీనితో పవన్ మాట పోయినట్లయింది. మరి పవన్ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి. గత పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విజయవాడ పార్లమెంట్ టికెట్‌ను తన మనిషి పొట్లూరి వర ప్రసాద్‌కు కేటాయించాలని కోరినపుడు కూడా పవన్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురయిన సంగతి విదితమే. ఆ నాడు ఆ టికెట్‌ను కేశినాని నానికి కేటాయించటంతో పవన్ కినుక వహించారు. చంద్రబాబు స్వయంగా పవన్ ఇంటికి వెళ్ళి వివరణ ఇచ్చి బుజ్జగించటంతో పవన్ మళ్ళీ టీడీపీ-బీజేపీ తరపున ప్రచారంలో పాల్గొన్నారు. మరి ఈ సారి ఏమవుతుందో!