వరుసగా రెండోసారి టీ పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన గాంధీభవన్ కు వచ్చారు. ఆయనకు కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ అయిన వెంటనే పీసీసీ కొత్త కమిటీ ఏర్పాటు అవుతుందని చెప్పారు. ఈసారి కమిటీ సైజు తగ్గుతుందనీ, కొంత ప్రక్షాళన కూడా ఉంటుందని చెప్పారు. పార్టీ పనుల్లో కొంతమంది అలసత్వం ప్రదర్శిస్తున్నారనీ, ఇదే సమయంలో మరికొంతమంది బాగా కృషి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే బస్సు యాత్ర నిర్వహిస్తామని ప్రకటించారు. వర్కింగ్ కమిటీ సభ్యులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శుల నియామకాలకు సంబంధించి కొన్ని పేర్లను ఇప్పటికే పరిగణనలోకి తీసుకున్నట్టు ఉత్తమ్ చెప్పారు.
నిజానికి, టీ పీసీసీ అధ్యక్ష పదవి కోసం చాలామంది కాంగ్రెస్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఢిల్లీ స్థాయిలో చేయాల్సిన ప్రయత్నాలు చాలానే చేశారు! కానీ, మరోసారి ఉత్తమ్ నే కొనసాగిస్తున్నారు అనేసరికి… ఇకపై పార్టీలో వారి క్రియాశీలత ఏ విధంగా ఉంటుందో చూడాలి. పీసీసీ పీఠంపై బాగా ఆశలు పెట్టుకున్నవారిలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నారు. దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న తనకు పదవి ఇవ్వాలంటూ ఓపెన్ గానే ఆయన కోరిన సందర్భాలున్నాయి. నిజానికి, ఉత్తమ్ అధ్యక్షత పనిచేయడం ఆయనకు ఇష్టం లేదన్న అభిప్రాయం మొదట్నుంచీ ఉంది. కానీ, ఇప్పుడు మరోసారి ఉత్తమ్ నాయకత్వంలోనే పార్టీ ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి స్పందన ఎలా ఉందంటే.. పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ ఉన్నా, మరొకరు ఉన్నా అందరమూ కలిసి పనిచేస్తామని చెబుతున్నారు! అంతేకాదు, ఉత్తమ్ అధ్యక్షుడిగా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదనే మాట ముగిసిపోయిన అంశమని వ్యాఖ్యానించారు. పీసీసీ అధ్యక్ష పదవిని ఆశించిన మాట వాస్తవమేననీ, కానీ అధిష్టానం సూచనలు మేరకు నడుచుకోవాలని ఇప్పుడు చెబుతున్నారు.
సహజంగానే కొంత అసంతృప్తి ఉన్నా… దాన్ని ఈ సందర్భంలో బహిర్గతం చేయలేరు కదా! ఇక, జానారెడ్డి, పొన్నాల స్పందనలు ఏంటో కూడా తెలియాల్సి ఉంది. అయితే, ఉత్తమ్ కు సీనియర్ నేతలైన జైపాల్ రెడ్డి మద్దతు ఉంది! వీహెచ్ కూడా కొంతమేరకు బాగానే సహకరిస్తున్నారు. ఎలాగూ రేవంత్ ను దగ్గరుండి పార్టీలోకి తెచ్చింది ఆయనే. ఢిల్లీలో హైకమాండ్ దగ్గర తనకు పట్టుందని ఈ సందర్భంగా మరోసారి అప్రకటితంగానే ఇతర నేతలకు ఉత్తమ్ సందేశం ఇచ్చినట్టు కూడా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి, మరోసారి పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగించడంపై భిన్నాభిప్రాయాలున్నా.. ఇప్పట్లో బయటపడే అవకాశాలు తక్కువ. పైగా, పార్టీలో పదవుల నియామకాలు కూడా త్వరలోనే ఉంటాయని అంటున్నారు కదా!