కేంద్ర బడ్జెట్ తయారీ కొద్ది రోజుల ముందు మరో రొటీన్ మీటింగ్ ఇది..! విజయవాడలో దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపీ ఎంపీలు కూడా హాజరయ్యారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు, కొత్త రైళ్ల ప్రతిపాదనలు, కొత్త లైన్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికలు వంటివి ఈ సమావేశంలో చర్చించారు. రాయలసీమ నుంచి రాజధాని అమరావతికి కనెక్టివిటీ పెంచాలని ఎంపీలు డిమాండ్ చేశారు. అయితే, ఈ సమావేశంపై ఎంపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ఓపక్క బడ్జెట్ పేపర్లు ప్రింటింగ్ అవుతుంటే, తమ నుంచి ప్రతిపాదనలు తీసుకునే ప్రయత్నం ఏంటంటూ పలువురు ఎంపీలు అభిప్రాయపడ్డారు. గత ఏడాది అడిగి తీసుకున్న ప్రతిపాదల్నే పరిగణనలోకి తీసుకున్న తాఖలాలు లేవనీ, ఇచ్చిన హామీలపై ఇంతవరకూ ఎలాంటి స్పందనా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎంపీ రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ… ఇక్కడికి విందు భోజనం కోసం తాము వచ్చామనీ, కూరలూ స్వీట్లు బాగున్నాయంటూ ఎద్దేవా చేశారు. కేవలం భోజనాలకు వచ్చినట్టే తమకు అనిపిస్తోందనీ, తప్పితే ఈ సమావేశం వల్ల ఎలాంటి ఉపయోగం లేదంటూ ఆయన విమర్శించారు. మరో ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ… ఈ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు రైల్వే బోర్డుకుగానీ, రైల్వే మంత్రిత్వ శాఖకుగానీ చేరే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన తరువాత విశాఖకు రైల్వే జోన్ వస్తుందని ప్రజలు ఎదురుచూస్తున్నారనీ, ఇది ఏపీ ఆకాంక్ష అనీ, చట్టంలో కూడా దీన్ని పొందుపరచారని ఎంపీ అన్నారు. ఇక, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అయితే తన మార్కు కామెంట్స్ చేశారు. రైల్వేజోన్ విషయమై ఎంపీలు ఏమీ చేయలేరన్నారు. చెయ్యి పైకెత్తమంటే ఎత్తుతామనీ, లేదంటే దించమంటే దించుతామని అన్నారు. రైల్వే జోన్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడాలని కొంత ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా ఎంపీలు కూడా రైల్వేజోన్ విషయమై డిమాండ్ చేశారు. కనీసం మూడు నెలల ముందైనా ఇలాంటి సమావేశం ఏర్పాటు చేయాలని కోరామనీ, ఇప్పుడీ చివరి నిమిషంలో ప్రతిపాదనలు తీసుకోవడం వల్ల ఉపయోగం ఉండదనే అభిప్రాయం ఎంపీల నుంచి వ్యక్తమైంది.
నిజానికి, ఇది ఒక రొటీన్ మొక్కుబడి సమావేశం అనే చెప్పొచ్చు. ఓపక్క బడ్జెట్ పత్రాలూ అంచనాలూ సిద్ధమైపోయిన తరువాత ప్రతిపాదనలు తీసుకుని ఏం చేస్తారు..? సరే, కొత్త రైళ్లూ, లైన్ల కేటాయింపుల సంగతి పక్కనబెడితే… కనీసం ఈసారైనా విశాఖ రైల్వే జోన్ పై కేంద్రం నుంచి ఏదైనా కదలిక ఉంటే బాగుంటుంది. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చెప్పినట్టు ఏపీ ఎంపీలు చేసేదేం లేదు. చేయాల్సిన సందర్భంలో చేస్తే బాగుండేది..! ఇప్పుడు మిగిలింది కేవలం కేంద్రం స్పందన మాత్రమే. ఏపీ విషయంలో ఈ మధ్య కేంద్రం వైఖరికి మారినట్టు కనిపిస్తోంది. ఏపీలో భాజపా రాజకీయ అవసరం అనే ప్రాతిపదికన మాత్రమే రైల్వే జోన్ పై కేంద్రం నిర్ణయం ఉండే అవకాశం మాత్రమే ఉంది. ఆ కోణం నుంచి మాత్రమే కొంత ఆశ ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి, ఈ నేపథ్యంలో ఇలాంటి సమావేశాలు ఎన్ని జరిగినా వీటి ప్రభావం ఢిల్లీ వరకూ చేరడం అనేది కొంత అనుమానమే..!