తెలంగాణ బిజెపి పరిస్థితి ఇప్పుడంతా ఎదురుగాలిగా వుంటున్నది. అన్ని పార్టీలలోంచి అసంతృప్త జీవులు ఆశావహులైన హేమాహేమీలంతా తమ పార్టీలోకి వచ్చేస్తారని ఆ పార్టీ నేతలు ఇటీవలి దాకా ఆశలు పెట్టుకున్నారు. అయితే ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్రానికి’బిస్కెట్’వేసి టిఆర్ఎస్ పట్ల మెతక వైఖరి అనుసరించేలా చేశారని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. తాము వద్దని మొత్తుకుంటున్నా కేంద్ర మంత్రులు ఒకరి తర్వాత ఒకరు వచ్చి కెసిఆర్ సర్కాను కీర్తించి పోవడం వారికి అస్సలు మింగుడుపడటం లేదు. యెన్నం శ్రీనివాసరెడ్డి, ప్రేమ్‌సింగ్ రాథోడ్, కొమ్మూరి ప్రతాపరెడ్డి వంటివారంతా బయిటకు వెళ్లడం ఇందుకు నిదర్శనంగా భావిస్తున్నారు. మరింత మంది నేతలు ఆ బాటలోనే వున్నారట.నాగం జనార్థనరెడ్డి వంటివారు మొదటి నుంచి అర్థమనస్కంగానే కొనసాగుతున్నారు. తామే వచ్చేస్తామన్న వూపులో టిడిపితో పొత్తు ప్రసక్తే లేదని బిజెపి ప్రకటించింది. అయితే ఆ తర్వాత టిడిపి టిఆర్ఎస్ కలయిక కబుర్లు మొదలైనాయి. దాంతో బిజెపి మరింత ఇరకాటంలో పడింది. ఎపిలో కూడా తాము ఎంత మొత్తుకున్నా అధిష్టానం టిడిపిని వదలడం లేదని బిజెపి రాష్ట్ర నేతలు ఆగ్రహంగా వున్నారు. అయితే కేంద్రంలో అధికారమే ముఖ్యం గనక తెలుగు రాష్ట్రాల్లో అవకాశాలు నామమాత్రం గనక పైవారితో బాగుండటమే ముఖ్యమని మౌనం పాటిస్తున్నారు. పైగా ఇటీవల గుజరాత్ ఎన్నికల ఫలితాల తర్వాత గతంలో వున్న వూపు కూడా తగ్గింది. జిఎస్టి తమకు చాలా నష్టం చేసిందనేది వారి వాదనగా వుంది.