టిపిసిసి అద్యక్షుడుగా ఉత్తమ కుమార్ రెడ్డిని కొనసాగిస్తున్నట్టు అధిష్టానం నుంచి వచ్చిన సమాచారం అస్పష్టతను తొలగించివుండొచ్చు. ఉత్తమ్ ఉత్సాహం పెరిగింది కూడా. అద్యక్షుడు రాహుల్‌గాంధీకి ఆయన కృతజ్ఞతలు తెల్పడమే గాక తన బృందంతో సలహాదారులతో మంతనాలు ప్రారంభించారు కూడా. అయితే విషయమేమంటే ఈయనను ఒక్కరినే గాక దేశమంతా ఎక్కడా పిసిసి అద్యక్షులను మార్చవద్దని రాహుల్ నిర్ణయించారు. పిసిసి బృందాలను మాత్రం మారుస్తున్నారు. నాయకత్వాలను మార్చి లేనిపోని కొత్త తలనొప్పులు తెచ్చుకోవడమెందుకని ఆయన అనుకుని వుండొచ్చు. ఒక అంచనాకు రాకముందే హడావుడి మార్పులు వద్దని వాయిదా వేసి వుండొచ్చు కూడా. ఇప్పుడు ఎన్నికలు జరిగే కర్ణాటకపై ఆయన దృష్టి ఎక్కువగా కేంద్రీకృతమైంది. ఎపి తెలంగాణ నేతలను అక్కడకు పరిశీలకులుగా పంపుతున్నారు కూడా. గుజరాత్ ఇచ్చిన విశ్వాసంతో బిజెపిని ఓడించే వ్యూహాల కోసం రాహుల్ అన్వేషిస్తున్నారు. చిన్న హిందూత్వ వల్లనే అక్కడ మెరుగైనామనుకుంటున్న కాంగ్రెస్ ఇప్పుడు బిజెపి తరహా వ్యూహాలకు తెరతీసింది. గుజరాత్లో ఆలయాల పరిరక్షణకు సిద్ధమైంది. సూర్యోదయ సంధ్యే ఆర్తి కమిటీలంటూ అక్కడ హారతి పట్టే కమిటీలను ఏర్పాటు చేస్తున్నది. రోజుకు రెండు సార్లు హారతి ఇచ్చేందుకు సిద్ధమయ్యే వారికి పూజా సామగ్రి ఇస్తున్నారట. ప్రతిపక్ష నాయకుడైన పరేష్ ధన్ని అమలు చేస్తున్న ఈపథకానికి రాహుల్ ఆశీస్సులున్నాయట. ఇదేగాక మేక్ ఇండియా పేరిట మరో ప్రణాళిక వేస్తున్నారు. ఇలాటి సమయంలో పిసిసిల మార్పు వంటి పెద్ద కసరత్తు వద్దనుకున్నారు. అంతా అదుపులోకి వచ్చాక అప్పుడు అనుకున్నది చేస్తారు.