తనని తాను కుటుంబ పెద్దగా అభివర్ణించుకున్నారు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్. ఢిల్లీలో వరుస భేటీలతో ఆయన బిజీబిజీగా గడిపారు. రాష్ట్రపతిని కలుసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం శాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్ లతో వేర్వేరుగా భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సమస్యల పరిష్కారం దిశగా కేంద్రం కృషి చేస్తోందన్నారు. విభజన నేపథ్యంలో ఇంకా పెండింగ్ లో ఉన్న సమస్యల్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామరస్యంగా పరిష్కరించుకుంటారని ప్రధానికి చెప్పినట్టు తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టులు, ఇతర అంశాలపై రొటీన్ మీటింగ్ జరిగిందన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతలు, ఏపీ భాజపా నేతలు చేసిన విమర్శల ప్రస్థావన ఆయన దగ్గర తీసుకొస్తే… ఇవి కుటుంబంలోని అంతర్గత సమస్యలు అన్నారు. పెద్దలకీ పిల్లలకీ మధ్య చిన్నచిన్నవి వస్తుంటాయనీ, ఆ తరువాత అందరూ కలిసి ముందుకు సాగాల్సిన పరిస్థితులు ఉంటాయని నరసింహన్ అన్నారు. అది ఒక కుటుంబ సమస్యగా మాత్రమే చూడాలనీ, దాని గురించి బయట మాట్లాడకూడదని, అన్నీ సర్దుకుంటాయనీ, ఏవో చిన్నచిన్న స్పర్థలు వచ్చినంత మాత్రాన సంబంధాలు తెగిపోవు కదా అంటూ గవర్నర్ చెప్పారు.
తనను తాను కుటుంబ పెద్దగా నరసింహన్ బాగానే చెప్పుకున్నారు. అయితే, ఈ స్పర్థలకు ఆస్కారం ఇచ్చింది ఎవరు..? ఆయన తీరే కదా! నిజానికి, నాలా బిల్లుపై తాత్సారం చేసి ఉండకపోతే.. ఏపీ భాజపా నేతలు గవర్నర్ ను ఎందుకు విమర్శిస్తారు! వ్యవసాయ భూమిని వ్యవసాయేతరంగా మార్చుకునే వీలు కల్పించే చట్ట సవరణ బిల్లుపై గవర్నర్ స్పందించలేదు. ఇదే తరహా బిల్లును తెలంగాణ సర్కారు తీసుకొస్తే.. మూడంటే మూడు రోజుల్లో దాన్ని ఆమోదించేశారు. దీంతో ఆయన తెలంగాణ పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఫైర్ అయ్యారు. ఢిల్లీకి ఫిర్యాదు చేస్తామన్నారు. నాలా బిల్లుపై ఆయన స్పందన ఎందుకు ఆలస్యమైందన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. ఇక, తెలంగాణ కాంగ్రెస్ నేతలు గవర్నర్ పై ఫైర్ అయిన సంగతీ తెలిసిందే. ఇసుక మాఫియా, మంద కృష్ణ మాదిగ అరెస్టు విషయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లేందుకు టీ కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్ కి వెళ్లారు. వీటి గురించి నేతలు వివరిస్తుంటే.. నరసింహన్ అన్యమనస్కంగా వినడంతో వాగ్వాదం మొదలైందన్నారు. తెరాస ప్రభుత్వాన్ని డిఫెండ్ చేసే విధంగా గవర్నర్ స్పందించారనే అభిప్రాయం వ్యక్తమైంది.
నాలా బిల్లుగానీ, టీ కాంగ్రెస్ నేతల భేటీ విషయంలోగానీ.. ఇక్కడ ఎవరి స్పందన విమర్శలకు తావిచ్చింది..? కుటుంబ పెద్దగా తనను తాను ఆపాదించుకున్నప్పుడు రాగద్వేషాలకు అతీతంగా ఆయన తీరు ఉండాలి కదా. అందుకు భిన్నమైన స్పందన ఆయన్ని వస్తోంది కాబట్టే.. ఇలాంటి విమర్శలకు ఆస్కారం కలుగుతోంది. ఏపీ భాజపా నేతలు, తెలంగాణ కాంగ్రెస్ నేతల విమర్శల్ని.. అవి వారి సమస్యలుగా నరసింహన్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వారి కోణాన్ని మాత్రమే చూపిస్తున్నారు. వారు అలా విమర్శించడానికి కారణమైన అసలు విషయాన్ని దాటేసేందుకే ఈ ‘కుటుంబ పెద్ద పాత్ర’ను తాను పోషిస్తున్నా అని చెప్పుకుంటున్నట్టుగా ఉంది.